ఎవరైనా అలా పదే పదే మరిగించిన నూనెను వాడడం చాలా ప్రమాదకరం.. ఎందుకంటే అధిక ఉష్ణోగ్రత వద్ద తరచూ వంట నూనెలను వినియోగించడంతో మానవ జీర్ణ ప్రక్రియపై ప్రభావం పడుతుంది. అందుకే ఎవరైనా ఇలా వంట నూనెను పదే పదే వాడుతున్నట్టు తెలిస్తే సమచారం ఇవ్వాలి అంటున్నారు అధికారులు.. ఇప్పటికే పలు హోటల్స్ లో దీనిపై అవగాహన కూడా కల్పించారు.
అయితే సాధారణంగా మిగిలిపోయిన వంటనూనెను బయట పారబోయడం, తోపుడుబండి వ్యాపారులకు విక్రయించడం చేస్తుంటారు కొందరు. మరికొందరు డబ్బుపై అత్యాశతో అలాంటి నూనెను ప్యాకింగ్ చేసి మరీ విక్రయిస్తున్నారు కూడా. కల్తీ నూనెను విక్రయించకుండా నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మిగులు వంట నూనెను బయోడీజిల్ తయారీ కంపెనీలకు విక్రయించేలా మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో వాడేసిన వంట నూనెలు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతినకుండా వినూత్న పద్ధతిలో బయోడీజల్ తయారు చేస్తున్నారు విశాఖపట్నంలోని జిల్లా ఆహార భద్రత శాఖ అధికారులు.. వాడిన వంటనూనె వల్ల జరిగే అనర్థాల గురించి నగరవాసులకు పెద్ద ఎత్తున అవగాహన నిర్వహిస్తున్నారు. వాడిన నూనెను అధికారులే కొనుగోలు చేస్తారని..తమకు ఒక్క సమాచారం ఇస్తే చాలంటున్నారు.
సేకరించిన నూనెతో బయోడీజిల్ తయారీ:
ఒకసారి వాడేసిన వంట నూనె నుంచి బయోడీజిల్‌ను తయారు చేసే కార్యక్రమానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు దేశ వ్యాప్తంగా 100 నగరాలలో ప్రారంభించింది. ఈ నూనె సాయంతో బయోడీజిల్ తయారు చేస్తారు. ఈ క్రమంలో భాగంగా విశాఖపట్నంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
టీపీసీ 25శాతం దాటితే ప్రాణానికే ముప్పు..!
వంటనూనెల్లో ప్రధానంగా టోటల్ పోలార్ కాంపౌండ్ (టీపీసీ- నూనె నాణ్యత తెలిపే ప్రమాణం) 25 శాతానికి మించకూడదు. తాజా నూనెలో 7శాతం, రెండోసారి వాడితే 15-18, మూడోసారి 24 శాతం ఉంటుంది. 25 శాతం దాటితే ఆ నూనె వినియోగానికి పనికిరాదు ఒకవేళ వినియోగిస్తే ప్రమాదకర జబ్బుల బారిన పడటం ఖాయం. ప్రజలు కూడా వంట నూనెలను ఎక్కువసార్లు వినియోగించకుండా అప్రమత్తం కావాలని.. ఒకవేళ ఎక్కువగా వాడేసిన నూనె ఉంటే మాత్రం బయోడీజిల్ సంస్థలు ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఇవ్వాలని ఆహార భద్రతా అధికారులు కోరుతున్నారు.
2030నాటికి బయోడీజిల్ అందించాలని సర్కారు ప్లాన్..!
పెట్రోలియం శాఖ లెక్కల ప్రకారం మన దేశంలో ప్రతినెల సగటున 850 కోట్ల లీటర్ల డీజిల్‌ను వాడుతున్నారు. 2030 నాటికి డీజిల్‌లో దాదాపు 5 శాతం మేర బయోడీజిల్‌ను కలపాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు గాను ఏడాదికి సగటున దాదాపు 500 కోట్ల లీటర్ల మేర బయోడీజిల్ అవసరమవుతుంది.
ఈ ప్రాసెస్ సక్సెస్ అయితే ప్రస్తుతం రోజురోజుకి ఆకాశాన్నంటుతున్న పెట్రోధరల నుంచి సామాన్య ప్రజలు బయటపడే అవకాశం దగ్గరలోనే ఉంది. మీ దగ్గర వాడిన నూనె ఉందా.. దాన్ని వంటనూనె సేకరించే సంస్థకు ఇవ్వాలనుకుంటున్నారా..? ఫ్రీగా కాదులేండి..డబ్బులిస్తారు.. అయితే వెంటనే ఈ క్రింది నెంబర్లను సంప్రదించండి.
ఫోన్ నెంబర్: 91605 14567