మీలో ఎంతమంది ఆధ్యాత్మికత, ధ్యానాన్ని విశ్వసిస్తారు? ఒకవేళ మీరు దీన్ని స్పష్టంగా విశ్వసిస్తే, స్వామి రామకృష్ణ మరియు ఆయన శిష్యుడు వివేకానంద వంటి గొప్ప నాయకులను తప్పకుండా గౌరవిస్తారు. అంతేకాదు రామకృష్ణుడికి జన్మనిచ్చినందున శారదా దేవికి నమస్కరిస్తారు. ఈ ముగ్గురి జీవితాలు ఎందరికో స్ఫూర్తి నింపాయి..మరెందరికో మార్గదర్శకంగా నిలిచాయి.
విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్‌లోని రామకృష్ణ మిషన్ ఆశ్రమ లైబ్రరీలో ఈ మహానుభావుల జీవిత చరిత్ర గురించి వివరించే ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. భారతదేశ ఆధ్యాత్మిక పరివర్తనకు దోహదపడిన మహనీయుల జీవితాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవాళ్లు తప్పకుండా ఈ ప్రదర్శనను తిలకించవచ్చు. శ్రీరామకృష్ణ, స్వామి, వివేకానంద మరియు శ్రీ శారదా దేవి జీవితాల చరిత్ర, వారి విధివిధానాలపై చిన్న చిన్న బొమ్మల ద్వారా ప్రదర్శన ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం పిల్లల నుంచి పెద్దల వరకు ఫోన్లు, సోషల్ మీడియా మాయలో పడి తప్పుదోవ పడుతున్నారు. ఎవ్వరికైనా బాల్యం నుంచే మంచి మార్గాన్ని భోదిస్తే…ఆరోగ్యకరమైన సమాజం తయారవుతుంది. మన దేశంలో మంచి మార్గాన పయనించి స్ఫూర్తిగా నిలిచిన మహానుభావులు ఎందరో ఉన్నారు. వాళ్ల జీవిత చరిత్రలు, జీవన విధానాల గురించి నేటి బాలలకు, భావితరాలకు చేరవేయడం చాలా ముఖ్యం.
ఆ ఎగ్జిబిషన్లో నేపథ్యమున్న ప్రతి బొమ్మ దగ్గర ఒక బోర్డు ఉంటుంది. అందులో వారి జీవితాల వివరాలను ఇంగ్లీష్, తెలుగులో పూర్తిగా వివరించారు. ఆ ప్రదర్శనను చూస్తూ… ఎదురుగా బోర్డులో ఉన్న వివరాలు చదివి మరింత వివరంగా తెలుసుకోవచ్చు. అంతేకాదు, ఈ రంగురంగుల బొమ్మలు, పురాతన కాలం నాటి భవనాలు, కొండప్రాంతాలు, పాతకాలపు నిర్మాణ వైభవాన్ని ప్రతిబింబిస్తాయి.
కళాకారుడు సూక్ష్మ ప్రతిరూపాలకు ప్రాణం పోసిన తీరు అద్భుతం. ఈ ఎగ్జిబిషన్ చూసి వెళ్లిన ప్రతి ఒక్కరికి కొన్ని రోజుల పాటు ఈ బొమ్మలు కళ్ల ముందే మెదులాడతాయి. ఈ ముగ్గురు మహానీయుల జీవితాన్ని చూడచక్కగా ప్రదర్శించారు. స్వామి రామకృష్ణ మరియు తల్లి శారదా దేవి, వివేకానంద జీవితంలో జరిగిన సంఘటనలు ఈ ప్రదర్శనలో కళ్ళకు స్పష్టంగా వివరించబడ్డాయి.
ముఖ్యంగా పిల్లలు ఈ ఎగ్జిబిషన్‌ను ఎంజాయ్చేస్తారు. ఆసక్తిగా వివేకానందుడి గురించి తెలుసుకుంటారు. వినోదంతో పాటు విజ్ఞానాన్ని పొందుతారు. ఆధ్యాత్మికత గురించి మీకు ఉన్న సందేహాలు తీర్చే ప్రదర్శన ఇది. అడ్రస్:రామకృష్ణ మిషన్, ఆర్కే బీచ్ రోడ్, విశాఖపట్నం , ఆంధ్రప్రదేశ్- 530003 ఈమెయిల్- visakhapatnam@rkmm.org ఫోన్: 0891- 3551477