ముఖ్యంగా విశాఖ జిల్లాలో మళ్లీ వైరస్ కలవర పెడుతోంది. గత మూడు రోజులుగా వంద దాటి కరోనా కేసులు విశాఖలో నమోదు అవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెండు నెలల ముందు పదుల లోపు కేసులు నమోదు అయ్యాయి. ఒక దశలో ఈ కేసులు పూర్తిగా తగ్గిపోయి జీరో నంబర్ కు దగ్గరయ్యాయి. దీంతో హమ్మయ్య అని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. వైరస్ సోకిన వ్యక్తుల్లో స్వల్ప లక్షణాలే ఉంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వైరస్ బారిన పడుతున్న వ్యక్తుల్లో జ్వరం దగ్గు జలుబు వంటి లక్షణాలు మాత్రమే ఉంటున్నాయని జిల్లాలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.
థర్డ్ వేవ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిన సుమారు నాలుగు నెలలు తరువాత రోజువారీ కేసుల్లో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. గత వారం రోజుల్లో చాలా మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. విశాఖ జిల్లాలో ప్రస్తుతం కేసుల సంఖ్య కొంత తక్కువగా కనిపిస్తున్నప్పటికీ పాజిటివిటీ రేటు భారీగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.