Cold Wave: ఆంధ్రప్రదేశ్ చలికి గజ గజ వణుకుతోంది. పశ్చిమ గాలుల ప్రభావంతో చలి తీవ్రత మరింత పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పొగ మంచు కమ్మేస్తోంది. ఉత్తర భారతదేశంతోపాటు ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అక్కడి నుంచి చలి గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలోనూ చలి పెరిగిందని వాతావరణ శాఖ తెలిపింది.
ముఖ్యంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయ పరిసర ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 1 నుంచి 4 డిగ్రీల వరకు పడిపోయాయి. జి మాడుగులలో మంగళవారం తెల్లవారుజామున అత్యల్పంగా 1.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పాడేరు, డుంబ్రిగూడ, చింతపల్లి, అరకు తదితర ప్రాంతాలు చలికి గజగజ వణుకుతున్నాయి.
అల్లూరి జిల్లా చింతపల్లిలో చలి ఉష్ణోగ్రత 2 డిగ్రీలు నమోదు కాగా లంబసింగిలో చలి ఉష్ణోగ్రతలు 1 డిగ్రీకి పడిపోయింది. ముఖ్యంగా పర్యటక ప్రాంతమైన లంబసింగిలో ఈ రోజు తెల్లవారుజామున బైకులపై కనబడుతున్న మంచు దృశ్యాలు చూసి పర్యాటకు పులకించిపోయారు. ఓ వైపు గజ గజ చలి వణికించినా.. ఆ మంచు దృశ్యాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పర్యాటకుల సంగతి ఎలా ఉన్నా..? మన్యం వాసులు ఎముకలు కోరికే చలిలో గజగజ వానికి పోతున్నారు. సూర్యుడు ఉదయించేవరకు ఇండ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు పిల్లలు వృద్దులు చలికి నానా అవస్థలు పడుతున్నారు . చలి నుంచి ఉపశమనం కోసం స్వెటర్లు మంకీ టోపీలు చేతి గ్లౌజులు కాళ్లుకు సాక్సులు వేసుకొని చలిమంటలు కాస్తున్నారు.