Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18. Cashew Down: తెల్లబంగారంగా చెప్పుకుని జీడిపప్పును ఇష్టపడని వారు ఎవరంటారు.. కనిపిస్తే లొట్టలేసుకని తినాలి అనిపిస్తుంది. ఆరోగ్యం పరంగా లాభాలు ఉంటాయి కాబట్టి జీడి పప్పుకు ఫుల్ డిమాండ్.. నేరుగా తినకపోయినా.. ఉప్మా, సేమియా, పరవన్నం, బిర్యానీ ఇలా వివిధ వంటల్లో జీడి పప్పు ఉంటే ఆ టేస్టే వేరు. అందుకే ఎంత ధర అయినా కొని తీరాలి అనుకుంటారు.
ఈ ఏడాది అనూహ్యంగా జీడి పప్పు ధరలు తగ్గుముఖం పట్టడంతో వ్యాపారులు దిగులు చెందుతున్నారు. జిల్లాలో 350కుపైగా జీడి పరిశ్రమలు ఉండగా.. ఒక్క పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లోనే 240కు పైగా ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి ఏటా సరాసరి ఒక్కో పరిశ్రమ 1,200 బస్తాల జీడి పిక్కలు పీలింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు పంపిస్తుంది.
గత ఏడాది ఈ సీజనులో కిలో జీడిపప్పు ధర 900 వరకు ఉంటే ప్రస్తుతం 650కు మించి వెళ్లడం లేదు. జీడి పిక్కలు బస్తా (80) కిలోలు 9,600 పలుకుతోంది. అధిక ధరలకు అమ్ముకోవచ్చని అనేకమంది వ్యాపారులు ముందస్తుగా జీడి పిక్కలు కొనుగోలు చేసి నిల్వ పెట్టుకున్నారు. ఒకే సంవత్సరంలో కొనుగోలు చేసిన పిక్కలు ఆ ఏడాదిలోనే పీలింగ్ చేయాల్సి ఉంది. దీంతో కిలో ధర 500 రూపాయలకు పడే ప్రమాదం ఉంది అంటున్నారు.
భారీ నిల్వలు పీలింగ్ చేస్తే బస్తాకు 1200 వరకు తిరిగి నష్టాలు వస్తున్నాయని వ్యాపారులు వాపోతున్నారు. భారీ నిల్వలు కారణంగా ఏదో ఒక ధరకు అమ్ముకోవడం తప్ప.. గత్యంతరం లేదని వ్యాపారులు చెబుతున్నారు. కరోనా తరువాత నుంచి జీడి పరిశ్రమల గతి మారిపోయింది. అప్పటి నుంచి నష్టాలు వస్తూనే ఉన్నాయి. దీనికి తోడు జీడిపప్పు ఉత్పత్తి విధానం మారిపోయింది.