P. Anand Mohan, Visakhapatnam,News18. London Eye at Visakha: ప్రకృతి గీసిన బొమ్మలా ఉండే విశాఖ అందాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అడుగడుగునా మదిని దోచే మనోహర దృశ్యాలు కను విందు చేస్తూ ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎందరినో కట్టిపడేసే అందాలు విశాఖ సొంతం.. భారత దేశంలోనే అంత్యంత అందమైన పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న విశాఖను ది ఇండియన్ శాన్ఫ్రాన్సిస్కో గా పోలుస్తారు కూడా..
ప్రకృతి కాన్వాస్ పై రమణీయ అందాలు..అడుగడుగునా మదిదోచే మనోహర దృశ్యాలు.. చక్కిలిగింతలు పెట్టే సహజ సిద్ధ సోయగాలు.. ఉవ్వెత్తున ఎగసిపడుతూ ఎన్నో ఊసులు చెప్పే సాగరతీర ప్రాంతాలు.. ఒకటేంటి విశాఖ గురించి ఎలాంటి వర్ణనలు ఎన్నో చెప్పొచ్చు. ఒకవైపు సముద్ర అలల తాకిడి... మరోవైపు కొండగాలి పలకరింపులు.. చూస్తుంటేనే ఏదో ఊహా ప్రపంచంలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది.
అది ఇక ఊహ కాదు.. త్వరలోనే ఆ ఊహలు నిజం కానున్నాయి. విశాఖపట్నంలో ‘లండన్ ఐ’ తరహాలో 125 మీటర్ల ఎత్తు ఉన్న మెగా వీల్‌ను బీచ్ రోడ్డులో నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి పర్యాటకశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం. దీన్నిమొత్తం 15 ఎకరాల్లో రూ.250 కోట్ల వ్యయంతో నిర్మించే ప్రతిపాదనలు ఉన్నాయి. అది పూర్తైతే.. ఈ మెగావీల్ ప్రపంచ మెగావీల్ టాప్–10లో ఒకటిగా నిలిచిపోవడం ఖాయమంటున్నారు అధికారులు..
లండన్ ఐ తరహాలో..
మిలీనియం వీల్.. ఇద లండన్ లోని అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే ప్రదేశం. థేమ్స్ నది ఒడ్డున ఏకంగా 130 మీటర్ల ఎత్తులోనున్న జెయింట్ వీల్ నుంచి లండన్ నగరాన్ని చూసే వీలుంది. దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కేవలం ఆ వీల్ కోసమే పర్యాటకులు పోటీ పడుతుంటారు. ఇప్పుడు అదే తరహాలో సముద్రం ఒడ్డున వైజాగ్ అందాలను ఒకేసారి వీక్షించేందుకు అనుగుణంగా మెగావీల్ను నిర్మించనున్నారు.
రాత్రి సమమంలో ఆ వీలు నుంచి విశాఖ అందాలను 360 డిగ్రీల కోణంలో చూస్తూ. 125 మీటర్ల ఎత్తులో భోజనం కూడా చేసే ఏర్పాట్లు చేయాలని పర్యాటకశాఖ నిర్ణయించింది. ఇప్పటికే ఈ మెగావీల్ నిర్మాణానికి అవసరమైన 15 ఎకరాల భూమిని అధికారులు పరిశీలిస్తున్నారు. బీచ్ రోడ్డులో 4 ప్రదేశాలను పర్యాటకశాఖ అధికారులు పరిశీలించినట్లు సమాచారం.
15 ఎకరాల్లో ఈ మెగావీల్తో పాటు షాపింగ్ కాంప్లెక్స్, పార్కింగ్, ఇతర రిక్రియేషన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం గ్లాసుతో నిర్మించనున్న కేబిన్ల ద్వారా చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూసే వీలు కలగనుంది. అంతేకాకుండా 125 మీటర్ల ఎత్తుకు వెళ్లిన తర్వాత కేబిన్ ఫ్లోరింగ్ కూడా గ్లాసుతో నిర్మించనుండడంతో కిందకు కూడా చూసే వీలుంటుంది.