ఏపీలో తాజా పరిస్థితి చూస్తుంటే లాక్ డౌన్ తప్పేలా లేదు. ప్రధాని నరేంద్ర మోది నేరుగా లాక్ డౌన్ ఉండదని చెబుతున్నా.. రాష్ట్రాల్లో ఆయా జిల్లాల్లో పరిస్థితిని బట్టి జిల్లాల వారిగా లాక్ డౌన్ విధించాలి అంటున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నాయి. ఇక ఏపీలోనూ అలాంటి పరిస్థితి నెలకొంది. చాలామంది ప్రజలు మానసికంగా లాక్ డౌన్ కు సిద్ధమైనట్టే కనిపిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. లాక్ డౌన్ పెడతారు. రెండు వారాలకు సరిపడ సరుకులు తెచ్చుకోవాలని పక్క వారికి చెబుతున్నారు.
మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటకల్లో పరిస్థితి దారుణంగా ఉండడంతో ఇప్పటికే అక్కడ నుంచి వలసకూలీలు భారీగా ఏపీకి తరలి వచ్చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ తప్పేలా లేదని.. మళ్లీ రావాణ లేకపోతే ఇబ్బందులు పడాలని.. గత అనుభవాలతో వారంతా ముందుగానే స్వగ్రామాలకు తరలి వచ్చేస్తున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు వలస కూలీలు భారీగా వెనక్కు వచ్చేస్తున్నారు.
ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతుంది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో ఆస్పత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి నెలకొంది. రోజూ పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి నుంచి 15 వందల మధ్య వస్తున్న నేపథ్యంలో మినీ లాక్ డౌన్ సరిపోతుందా లేదా పూర్తిగా లాక్ డౌన్ చేయాలన్న అన్న అంశపై సిక్కోలు వాసులను ప్రశ్నిస్తే లాక్ డౌన్ పెట్టాల్సిందే అని సమాధానం చెబుతున్నారు.
రోజు రోజుకూ పెరుగుతున్న కేసుల నేపథ్యంలో శ్రీకాకుళంను ఇప్పటికే కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. వాణిజ్య కేంద్రమైన పలసాలో 31 వార్డులలో కంటైన్మెంట్ జోన్లే ఉన్నాయి. పాతపట్నం, పాలకొండ ప్రాంతాల్లో కూడా కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. కంటైన్మెంట్ జోన్ లలో యువత నిబంధనలు పాటించకుండా బయట యథేచ్ఛగా తిరిగేస్తున్నారని దీంతో వైరస్ మరింత విస్తరిస్తోందని స్థానికులు మండిపడుతున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో భారీగా కరోనా కేసులు పెరుగుతుండడంపై జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యాలయాలు, బ్యాంకులు తక్షణం మూసివేయాలని కోరుతున్నారు. వైరస్ వ్యాప్తి నివారణకు లాక్ డౌన్ విధించాలని డిమాండ్ చేస్తున్నారు. బిజినెస్ టైమ్ తగ్గించి, లాక్ డౌన్ పెంచాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. గతేడాది మాదిరిగా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించేవారిని శిక్షించాలని కోరుతున్నారు. ప్రాణం కన్నా లాక్ డౌన్ మిన్న కదా అని ప్రశ్నిస్తున్నారు. కనీపం 14 రోజులు లాక్ డౌన్ విధించాలని కోరుతున్నారు.
14 రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని.. తామంతా రెండు వారాలకు సరిపడ సరుకులు ఇప్పటిక తెచ్చుకునేందుకు సిద్ధమయ్యాము అంటున్నారు. అలాగే చుట్టుపక్కల వారికి కూడా అదే సంగతి చెబుతున్నారు. రెండు వారాలకు సరిపడ సరుకులు తెచ్చుకుంటే బెటరని బైటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే లాక్ డౌన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కనీసం 14 రోజుల లాక్ డౌన్ విధిస్తేనే పరిస్థితి అదుపులోకి వస్తుందని కొందరు తేల్చి చెబుతున్నారు. కరోనా ఉద్ధృతిని యుద్ధకాలం పరిస్థితులుగా భావించాలని సూచిస్తున్నారు. పది రోజులు ఇళ్ల నుంచి జనం బయటకు రాకుండా ఉంటే వైరస్ చైన్ కట్ అవుతుందని చెబుతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం రెండు జిల్లాల్లోనూ ప్రజలే ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.