తెల్లవారు జామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ సంచిత గజపతిరాజు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ సంచిత గజపతిరాజు స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
రాత్రికి వైదిక వర్గాలు స్వామివారికి సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. వేదమంత్రాల నడుమ స్వామివారికి తొలి విడత చందనం సమర్పించారు. సింహగిరిపై ఏకాంతంగా అప్పన్న చందనోత్సవం.. ఏటా చందనోత్సవం అంగరంగ వైభవంగా జరిగేది. లక్షలాది మంది భక్తులు స్వామి నిజరూపాన్ని కనులారా దర్శించుకునేవారు. గత ఏడాది కరోనా కారణంగా ఏకాంతంగానే చందనోత్సవం జరిగింది. ఈసారి కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా రెండో ఏడాది కూడా భక్తులు లేకుండానే ఉత్సవం జరిగింది.
సాయంత్రం నాలుగున్నరకు దాతల గోత్ర నామాలు చదివి ప్రత్యేక పూజలు చేశారు. ఐదు గంటల సమయంలో విశ్వక్సేన ఆరాధన , పుణ్యాహవచనం, అష్టోత్తర శతక కలశ స్నపన మండపం , ఆవాహనం ఆరాధన అనంతరం తిరుమంజనం . పంచామృత అభిషేకం జరిపించి సింహాచల క్షేత్రంలో అత్యంత ప్రసిద్ధమైన , పరమ పావన పశ్చిమ వాహిని గంగధార నుంచి తేబడిన తీర్థంతో సహస్ర ఘటాభిషేకం జరిగింది.
తరువాత స్వామివారిని విశేష ఆరాధన, శీతల నివేదన జరిపి తొలి విడత చందన నివేదన జరుగుతోంది.
కరోనా మహమ్మారి మానవాళిని కబలిస్తున్న వేళ.. ప్రజలంతా ఆయురారోగ్య సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, లోకం సుభిక్షంగా ఉండాలని నిజరూపంలో దర్శనమిచ్చిన సింహాద్రినాధుడికి ప్రత్యేక పూజలు చేసినట్లు దేవస్థానం ధర్మకర్త సంచయిత గజపతి, ఈవో ఎంవి.సూర్యకళ వెల్లడించారు.