Jagananna Vidya Deevena: ఆంధ్రప్రదేశ్ లోని విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం. పేద విద్యార్థుల ఉన్నత విద్యకు సహకారం అందించే ఉద్దేశంతో ప్రతి ఏటా అందిస్తున్న జగనన్న విద్యా దీవెన.. నాలుగో విడత నగదు రేపు తల్లుల ఖాతాలో జమ కానున్నాయి. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పర్యటించనున్న ముఖ్యమంత్రి జగన్.. అక్కడ జరిగే కార్యక్రమంలో బటన్ నొక్కి జేవీడీకి అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు జమచేయనున్నారు.
అయితే మొదటి ఈ శనివారమే తల్లుల ఖాతాలో ఈ నగదు జమ చేస్తామని ప్రభుత్వం షెడ్యూల్ లో ప్రకటించింది. కానీ అదే సమయంలో అంటే.. తిరువూరులోని ముఖ్యమంత్రి సభా వేదికకు పక్కనే ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. అందుకే జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని అదివారానికి వాయిదా వేశారు.
రేపు తిరువూరులో మోహన్ రెడ్డి పర్యటన ఉంటుందని. జగనన్న విద్యాదీవెన నాలుగో విడత విడత కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని మాజీ మంత్రి వెల్లంపల్లి ప్రకటించారు.. గతకాలంలో పేదవిద్యార్థులకు ఉన్నత చదువు భారంగా మారింది. ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేశారని.. కానీ వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత చదువుల్లో విప్లవం తెచ్చారని గుర్తు చేశారు. ప్రతీ ఒక్కరూ చదువుకోవాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారని.. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారని గుర్తు చేశారు.
ఉన్నత చదువులు చదివే పేద విద్యార్ధులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా ఐటీఐ విద్యార్ధులకు 10 వేలు ప్రతి ఏటా రెండు వాయిదాల్లో.. పాలిటెక్నిక్ విద్యార్ధులకు 15 వేల రూపాయలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు నేర్చుకునే వారికి 20 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది ప్రభుత్వం.
గత ప్రభుత్వం పెట్టిన ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు 1,778 కోట్ల రూపాయలతో సహా ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల క్రింద ప్రభుత్వం సాయం అందించింది. ఇతర సంక్షేమ పథకాలతో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు లిమిట్స్ లేవని సీఎం స్పష్టం చేశారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ పథకం కింద లబ్ధిచేకూరనుంది.
మరోవైపు.. 2841 కోట్లు బడ్జెట్ లో విద్యకు కేటాయించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌దే అని ప్రశంసలు కురిపించారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు.. అక్షర క్రమంలోనే కాదు విద్యలోనూ ఏపీ టాప్ లో ఉండాలనేది సీఎం ఆలోచన.. అందుకే విద్య పై స్పెషల్ ఫోకస్ పెట్టారన్నారు. ఈ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్ మెంట్ అంటే వైఎస్సార్ గుర్తుకొస్తారని.. అలాగే తండ్రిబాటలోనే సీఎం జగన్ నడుస్తున్నారన్నారు మల్లాది విష్ణు.