APSRTC Charges: సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికుల ఆదరణ పొందేందుకు ఆర్టీసీ నడుం బిగించింది. ముఖ్యంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులతో పాటు, పొరుగు రాష్ట్రాల ఆర్టీసీలతో పోటీపడేందుకు వీలుగా నిర్ణయం తీసుకుంది. అయితే అన్ని బస్సుల్లో కాకపొయినా.. కొన్ని ఎంపిక చేసిన ఏసీ బస్సుల్లో అవసరాన్ని బట్టి ఛార్జీలు తగ్గించేలా అధికారులు నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అప్పటి నుంచి దీనిని అమలు చేయడం లేదు. అవసరాన్ని బట్టి.. ఆయా జిల్లాల్లో రద్దీని బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు. అన్ని జోన్ల ఈడీలు, అన్ని జిల్లాల ఆర్ఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 20 శాతం వరకు ఛార్జీలు తగ్గించేందుకు వీలుగా గతంలో ఉన్న ఉత్తర్వులను అమలు చేసేందుకు జిల్లాల్లో రీజనల్ మేనేజర్లు నిర్ణయం తీసుకోవచ్చని ఆదేశించారు.
ప్రయాణికుల సంఖ్య తగ్గడానికి కారణం ఇదే..
కరోనా ప్రభావం, చలి ఎక్కువగా ఉండటంతో సంక్రాంతి తర్వాత ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) పడిపోయింది. అన్ని బస్సుల్లో కలిపి సగటు ఓఆర్ 63-64 శాతం ఉండగా.. ఏసీ బస్సుల్లో మాత్రం చాలా ఘోరంగా ఉంటోంది. ఆయా రూట్లను బట్టి 30-50 శాతం మధ్య ఓఆర్ ఉంటున్నట్లు గుర్తించారు.
తక్కువ ధలకు నడుస్తున్న ఇతర రాష్ట్రాల బస్సులు
ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక ఆర్టీసీలు.. ఏసీ సర్వీసుల్లో ఛార్జీలు తగ్గించి నడుపుతున్నాయి. దీనివల్ల ఏపీఎస్ఆర్టీసీ బెంగళూరుకు నడిపే ఏసీ, హైదరాబాద్ ఏసీ సర్వీసుల్లో ప్రయాణికులు తక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఛార్జీల తగ్గింపునకు వీలు కల్పించారు.
అయితే ఇవి గతంలో ఉన్న ఆదేశాలేనని, ఇపుడు అమలు చేస్తున్నామని, ఈ విషయంలో ఆర్ఎంలకు విచక్షణ అధికారం ఉంటుందని ఈడీ (ఆపరేషన్స్) బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఇప్పటికే కృష్ణా జిల్లా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రైవేట్ బస్సులు ప్రకటించినట్లుగా ఆఫర్లను ప్రకటించేందుకు సిద్ధమైంది ఆర్టీసీ. కృష్ణా జిల్లా – హైదరాబాద్ మధ్య రాకపోకల కోసం ప్రయాణికులకు చార్జీలను తగ్గించాలని నిర్ణయించింది ఆర్టీసీ.
ఇంద్ర, అమరావతి, గరుడ, నైట్ రైడర్, వెన్నెల స్లీపర్ బస్సుల్లో చార్జీలను తగ్గించనున్నట్లు ప్రకటించింది. కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్కు వెళ్లేవారికి ఆదివారం మినహా అన్నీ రోజుల్లో చార్జీలు తగ్గించనున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్కు వెళ్లేవారికి ఆదివారం మినహా అన్నీ రోజుల్లో చార్జీలు తగ్గించనున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. హైదరాబాద్ నుంచి కృష్ణా జిల్లాకు వచ్చేవారికి శుక్రవారం మినహా మిగిలిన రోజుల్లో చార్జీలు తగ్గింపు ఉండనుంది.
గుడివాడ నుంచి BHELకు ఇంద్ర బస్సులో చార్జీ రూ.610 నుండి రూ.555కు తగ్గించింది ఆర్టీసీ. విజయవాడ నుంచి హైదరాబాద్కు అమరావతి బస్సు చార్జీ రూ.650 నుంచి రూ. 535కి తగ్గించింది. ఇదే రూట్లో గరుడ బస్సు చార్జీని రూ.620 నుంచి రూ.495కు తగ్గించింది. వెన్నెల స్లీపర్ బస్సు చార్జీ రూ.730 నుంచి రూ.590కి తగ్గించింది.