Venkaiah Naidu Morning Walk: ఎప్పుడూ అధికారిక కార్యక్రమాలు.. ప్రొటోకాల్ తో బిజీగా ఉండే ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. సరదాగా కాసేపు రిలాక్స్ అవుతున్నారు. విజయవాడ పర్యటనలో ఉన్న ఆయన.. ఆరోగ్యమే మహా భాగ్యమనే మేసేజ్ ఇచ్చారు. ఉదయపు నడక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది అంటున్నారు. అందుకే డాక్టర్లు ఉదయం వాకింగ్ చేయాలంటున్నారు. సొంతరాష్ట్ర పర్యటనలో వున్న భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఇలా మార్నింగ్ వాక్ చేస్తూ 72 ఏళ్ల వయసులోనూ తన ఫిట్ నెస్ సీక్రెట్ ఇదే అన్నారు.
ప్రస్తుతం విజయవాడ పర్యటనలో ఉన్న వెంకయ్యనాయుడు మార్నింగ్ వాక్ తో ఉత్సాహంగా కనిపించారు. ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్ లో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో కలిసి వ్యాయామం చేశారు. వారికి నడక ప్రాధాన్యతను వివరించారు. ఎంత బిజీగా వున్న ఉదయం నడక సాగించాలని వెంకయ్య వారికి సూచించారు. ఆయనే స్వయంగా వివిధ వ్యాయామాలు చేశారు. విద్యార్ధులతో ముచ్చటించారు.
ఆ తరువాత విజయవాడలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో జరిగిన ముప్పవరపు ఫౌండేషన్–రైతునేస్తం అవార్డుల ప్రదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. అన్నదాతల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారి సమయంలో ముందు వరుస పోరాట యోధులతో సమానంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో రైతులు చేసిన కృషి మరచిపోలేనిదన్నారు. రైతుల దృష్టిలో వ్యవసాయం అంటే వృత్తి కాదని, సేద్యాన్నే తమ జీవితంగా భావిస్తారని తెలిపారు.
వ్యవసాయ రంగంలో శాస్త్రీయ విధానాలను ప్రవేశపెట్టిన ఘనత భారతీయులకే దక్కుతుందని వెంకయ్యనాయుడు చెప్పారు. భారతీయ వాజ్ఞ్మయంలో కృషి విజ్ఞాన ప్రస్తావన ఉందన్నారు. మట్టిలోని సారాన్ని మనుగడకు ఉపయోగపడే ఆహారంగా మార్చే పవిత్ర యజ్ఞమే వ్యవసాయమన్న ఆయన.. పర్యావరణ హిత వ్యవసాయ విధానాలపై రైతుల దృష్టి కేంద్రీకరించాలని సూచించారు.
వ్యవసాయం అంటే పంటలు పండించడమే కాదు.. పర్యావరణాన్ని కూడా కాపాడుకోవడం అని తెలిపారు. పలువురు రైతులతో పాటు సేద్యానికి దన్నుగా నిలుస్తున్న శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, పాత్రికేయులకు అవార్డులు బహూకరించారు. 17 ఏండ్లుగా రైతునేస్తం మాసపత్రిక ద్వారా అన్నదాతకు చేదోడుగా నిలుస్తూ ఏటా ఈ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వెంకటేశ్వర రావును ప్రత్యేకంగా అభినందించారు.
భారత దేశం అభివృద్ధి పథంలో పయనించాలంటే యువతే కీలకమని,మాతృభాషలో చదువుకోవడం అభివృద్ధికి ఏమాత్రం ఆటంకం కాదని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. యువత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. విజయవాడలోని స్వర్ణభారత్ ట్రస్ట్ శిక్షణ పొందుతున్న యువతీ యువకులతో ఆయన కాసేపు ముచ్చటించారు. యువత నైపుణ్యాభివృద్ధిని పెంచేందుకు స్వర్ణభారత్ ట్రస్ట్ పని చేస్తోందన్నారు.
భారత సనాతన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శంగా నిలించిందన్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారందరూ మాతృ భాషలో నే విద్యను అభ్యసించారని ఆయన పేర్కొన్నారు. వ్యాయామంతోపాటు మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, ఆధ్యాత్మిక చింతన అలవర్చు కోవాలని సూచించారు. ఇవన్నీ మతానికి సంబంధించినవి కావని, మంచి ఆధ్యాత్మిక చింతన ద్వారా సామాజిక బాధ్యత అలవడుతోం దన్నారు. జంక్‌పుడ్ సంస్కృతిని మానుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.
జనాకర్షక పథకాలపై దృష్టి పెట్టి.. ఉన్న డబ్బును ఎక్కువగా వాటికి ఖర్చుపెడితే సమస్య పరిష్కారం కాదని వ్యాఖ్యానించారు. ‘ఉచితాలు, తాత్కాలిక జనాకర్షక పథకాలతో ప్రజలకు మేలు కలగదని 50 ఏళ్ల ప్రజాజీవితంలో నేను గమనించాను.. ఇబ్బందిగా ఉన్నవారికి ఆహారం అందజేయాలన్నారు. దేశంలో రేషన్ కార్డులు ఉన్నవారంతా పేదవాళ్లేనా? అనేది మనమంతా ఆలోచించుకోవాలి అన్నారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంతో పాటు దీర్ఘకాలికంగా వారికి చేయూతనందించేలా పథకాలు చేపట్టాలి అని సూచించారు. తన లెక్కలో రైతుకు కావాల్సింది ఉచిత విద్యుత్తు కాదు.. 10-12 గంటల నాణ్యమైన, నిరాటంకమైన విద్యుత్తు అన్నారు.