P. Anand Mohan, Visakhapatnam, News18 Vegetable price: ఓ వైపు కరోనా వైరస్ టెన్షన్.. మరోవైపు ఉద్యోగాలు, జీతాల్లో కోతలు.. వీటిన్నటింకీ తోడు పెరుగుతున్న రేట్లు సామాన్యుడి జీవితం భారంగా మార్చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్, వంట నూనె ధరలు సామాన్యులకు చుక్కలు చూపించాయి. ఈ ఎఫెక్ట్ ఎక్కువగా కూరగాయలపై పడుతోంది.
గత నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా మునగ పంట దెబ్బతినడం వల్లే ధర పెరిగినట్టు రైతులు చెబుతున్నారు. దీంతో రాష్ట్రం నుంచి మునగకాయలు దిగుమతి అవుతున్నాయి. ఒక్క మునగకాయలు మాత్రమే కాదు వంకాయ, దొండకాయ, బెండకాయ, కాకర కాయ, ఆకులు కూరలు ఇలా ఏది కొందమన్నా.. అర్థ కిలోనే దాదాపు 50 రూపాయలు చెబుతున్నారు. ఇదేం రేట్లు అంటే ఏం చేయం మాకు వచ్చిన ధరకే అమ్ముతున్నాం అంటున్నారు.
ఈ ఏడాది ఏకధాటిగా కురిసిన వర్షాలు పంటలను పూర్తిగా దెబ్బతీశాయి. దిగుబడులు లేక మార్కెట్కు వచ్చే ఉత్పత్తులు తక్కువగా ఉండటంతో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 20 రోజుల నుంచి కూరగాయల ధరలు అదుపులోకి రావడం లేదు. వారం రోజుల క్రితం కాస్త తగ్గినట్లు తగ్గి మళ్లీ ఎగబాకుతున్నాయి. ధరల పెరుగుదల సామాన్య, మధ్యతరగతి ప్రజలకు భారంగా మారుతోంది.
రోజు రోజుకీ పెరిగిపోతున్న కూరగాయల రేట్లు చూసి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలా ధరలు పెరుగుతూ పోతే తమ రోజువారి జీవితం ఎలా గడుస్తుందోనని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు కూరగాయాల సంగతి మరచి ఉట్టి అన్నం తినే రోజులు వచ్చేలా ఉందని ఆందోళన చెందుతున్నారు. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సామాన్యులు కోరుతున్నారు.