సంక్రాంతి పండుగకు ప్రతి ఆడపిల్ల పుట్టింటికి వెళ్లే ఆనవాయితీ ఉంది గనుక పోలమాంబ అమ్మవారిని కూడా సంక్రాంతి రోజుకు ముందు వచ్చే మంగళవారం గ్రామంలోనికి తెస్తారు. సంక్రాంతి పండుగ తరువాత వచ్చే మంగళవారం అమ్మవారికి పూజలు నిర్వహించి ఆ తరువాత వచ్చే మంగళవారం అమ్మవారి సిరిమానోత్సవం జరిపించటం అనాదిగా వస్తున్న ఆనవాయితీ.
శంబర గ్రామం సహా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూలి పనులకైనా వెళ్లి కొంత సొమ్మును దాచి పెట్టి మరీ వైభవంగా జరిపిస్తారు. ఎంత ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా సరే అమ్మవారిని మనస్ఫూర్తిగా కొలిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని అక్కడి ప్రజల నమ్మకం. అన్ని పండుగలు చేసుకున్నట్టు గానే కొత్త బట్టలు కొనుక్కుంటారు. అమ్మవారికి కూడా చీరను తీసుకుని రథం మానుకు చీరలు చూపించి, కోళ్లు మొక్కుబడులు చెల్లించుకుంటారు. వారి బంధువులను పండగకు ఆహ్వానిస్తారు.
మేళతాళాల నడుమ గ్రామపెద్దలు భుజాలపై ఎత్తుకొని సిరిమాను రథం వరకు తీసుకు వచ్చి రథంపై కూర్చోబెడతారు. తరువాత అమ్మవారికి గ్రామం తరపున బలులు సమర్పించిన తరువాత సిరిమాను ముందుకు కదులుతుంది. ముందుగా గిరిడ కుటుంబీకుల దగ్గర పూజలందుకుని పైడివీధి మీదుగా పనుకువీధి, గొల్లవీధి, ప్రధాన వీధుల్లో తిరగనుంది. అనంతరం అమ్మవారి ఘటాలను చదురుగుడిలో ఉంచుతారు.
సిరిమాను ఏర్పాట్లు.. ఎంతో ఘనంగా జరిగే శంబర పోలమాంబ సిరిమానోత్సవం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. మంగళవారం జరిగే మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సిరిమానోత్సవాన్ని తిలకించేందుకు ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, ఛత్తీస్ గఢ్, నుంచి పెద్ద ఎత్తున భక్తులు సిరిమానోత్సవంలో పాల్గొంటారు. మునుపెన్నడూ లేని విధంగా ప్రత్యేక క్యూలైన్లలో పైన సీలింగ్ ఫ్యాన్లు అమర్చి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.