తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఫిబ్రవరి నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి దర్శన టికెట్లను నేడు, రేపు విడుదల చేయనుంది టీటీడీ.. నేటి ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది టీటీడీ. రేపు అంటే జవనరి 29న ఉదయం 9 గంటలకు టైమ్ స్లాట్ సర్వదర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది.
అయితే టీటీడీ మాత్రం ముందు నుంచి ఫిబ్రవరిలో టికెట్ల కోటాను పెంచుతామని పదే పదే ప్రకటిస్తూ వచ్చింది. కానీ ప్రస్తుతం కరోనా నేథ్యంలో టీటీడీ.. వచ్చే నెల కూడా పరిమిత సంఖ్యలోనే టికెట్లను అందుబాటులో ఉంచుతోంది. అవి కూడా కేవలం ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తోంది. అయితే టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేసిన క్షణాల్లోనే ఖాళీ అయిపోతున్నాయి. దీంతో చాలామంది భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం తిరుపతి ఆన్ లైన్ టికెట్లకు భారీగా డిమాండ్ కనిపిస్తోంది. ముఖ్యంగా కరోనా భయాలు వెంటాడడంతో త్వరత్వరగా తిరుపతి వెళ్లి వచ్చేయడం మంచిదని.. తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలిదు.. మొక్కులు తీర్చుకోకపోతు ఇబ్బందులు తప్పవని భక్తులు భావిస్తున్నారు. అందుకే గత రెండు నెలల టికెట్లకు ఎవరూ ఊహించని విధంగా భారీ డిమాండ్ కనిపించింది.
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటుగా, విదేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. అయితే కరోనా నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupathi Devasthanams) శ్రీవారి దర్శనానికి పరిమిత సంఖ్యలో మాత్రమే టికెట్లను విడుదల చేయడంతో.. అవి ఆన్లైన్లో ఉంచిన కొద్ది నిమిషాల్లోనే హాట్ కేకుల్లా బుక్ అయిపోతున్నాయి.
ఫిబ్రవరి నెల నుంచి అయినా శ్రీవారి దర్శన టికెట్లను పెంచుతారనే ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం కరోనా మరోసారి వేగంగా వ్యాప్తి చెందడం, కేసులు అధికంగా నమోదు కావడంతో.. ఈ నెల కూడా పరిమిత సంఖ్యలోనే టికెట్లను విడుదల చేయాలని టీటీడీ నిర్ణయించింది. టికెట్లను బుక్ చేసుకోవడానికి భక్తులు.. టీటీడీ అధికారిక వెబ్సైట్ను మాత్రమే సందర్శించాల్సి ఉంటుంది.
ఫిబ్రవరిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అనుకునే వారు.. బ్రేక్ దర్శనం చేసుకోవాలి అనుకున్న వారు ఇవాళ ఉదయం తొమ్మిది గంటలకే టీటీడీ అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేసి.. అక్కడ ఆన్ లైన్ బుకింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేయగాననే ఫిబ్రవరి లింక్ కనిపిస్తుంది.. అక్కడ క్లిక్ చేసిన తరువాత దర్శనానికి వెళ్లేవారి పేర్లు, ఆధార్ నెంబర్లు, తేదీలు నమోదు చేయాల్సి ఉంటుంది..
తాజాగా నకిలీ వెబ్ సైట్లను అధికారులు గుర్తించారు. ఎందుకంటే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి లక్షల సంఖ్యలో నిత్యం భక్తులు వస్తుంటారు.. కరోనా సమయంలోనూ భక్తులు భారీగానే పోటెత్తుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వెంకన్న స్వామికి ఆదరణ ఉంది. దీంతో ఆ క్రేజ్ ను కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. అడ్డదారుల్లో డబ్బు సంపాదనకు దేవుడుని కూడా వాడేసుకుంటున్నారు. అందుకే ఈ వెబ్ సైట్ల పట్ట అప్రమత్తంగా ఉండాలి. కేవలం టీటీడీ అధికారిక వెబ్ సైట్ నుంచి మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలి..
కోవిడ్ నిబంధనలు తప్పనిసరి..
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందే. దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ రెండు డోసుల వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేదా 48 గంటల ముందు చేసుకున్న కోవిడ్ టెస్ట్ సర్టిఫికేట్ తప్పనిసరిగా అధికారులకు చూపించాలి. కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేదా ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికెట్ను ఉన్నవారిని మాత్రమే అలిపిరి చెక్ పాయింట్ నుంచి తిరుమలకు అనుమతిస్తున్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో భక్తులు ఇందుకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.