AP Employees Strike: తగ్గేదేలే అంటోంది పీఆర్సీ సాధన సమితి.. పీఆర్సీ ఉత్తర్వులను రద్దు చేస్తేనే ప్రభుత్వంతో చర్చలకు వస్తామని.. అప్పటి వరకు మాట్లాడుకోడాల్లేవని స్పష్టం చేసింది. ప్రభుత్వంతో చర్చలకు రావాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ చేసిన ప్రతిపాదనకు నో చెప్పింది. ముందు అశుతోష్ మిశ్ర నివేదికను ఇవ్వాలని డిమాండ్ చేసింది.
ఉద్యోగులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని ఖండించింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి విధానాన్ని చూడలేదంది. జనవరి నెలకు పాత జీతాలే ఇవ్వాలని, కొత్త జీతాలు ఇచ్చేందుకు ట్రెజరీ ఉద్యోగులపై ఒత్తిడి తేవొద్దని సూచించింది. జిల్లాలతో ఉద్యమ కార్యాచరణ సమన్వయం, సామాజిక మాధ్యమాల్లో వచ్చే విమర్శలపై సమాధానాలు ఇచ్చేందుకు 8 మంది సభ్యులతో పర్యవేక్షణ సెల్‌ను ఏర్పాటు చేసింది. అలాగే స్టీరింగ్ కమిటీలో సభ్యులను 20కిప పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమ్మెకు అన్ని సంఘాలూ మద్దతు ప్రకటించాయి.
ఇంత పెద్ద ఉద్యోగుల ఉద్యమం చరిత్రలో ఎప్పుడూ లేదని ఏపీ ఐక్య పోరాట సమితి ఛైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు. ‘స్టీరింగ్ కమిటీలో అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. సీఎస్‌కు ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు సమ్మె నోటీసు ఇస్తామన్నారు. ఈ ఉద్యమానికి కారణం ప్రభుత్వమే అని ఆరోపించారు. సాధారణంగా పీఆర్సీ అంటే జీతాలు పెరగడమే చూశాం. కానీ, ఇప్పుడు జీతాల రికవరీ చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పాత జీతాలే ఇవ్వాలని సీఎస్‌కు విన్నవించినా ప్రభుత్వం మొండి పట్టుదలతో ముందుకు వెళ్తోందన్నారు.
ఉద్యోగులను రెచ్చగొట్టడం మంచిది కాదని అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా ఉద్యోగులపై కుట్రలు చేయడం దారుణమన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నవి అబద్ధాలని, వారిపై మాటల యుద్ధం చేయాలని చెప్పడంపై ఆవేదన చెందుతున్నామన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూల వాతావరణం కల్పించాలే గానీ, ఘర్షణ వాతావరణం సృష్టించకూడదని అభిప్రాయపడ్డారు.
ఉద్యమ సమయంలో ఆవేదన, ఆవేశంతో మాట్లాడిన వాటిపైనా కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వాలంటీర్ల ద్వారా ఉద్యోగులకు వ్యతిరేకంగా కరపత్రాలతో ప్రచారం చేయిస్తున్నారని. ఇది మంచి పద్ధతి కాదని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. ఓ వైపు చర్చలు అంటూనే ఇలా దుష్ప్రచారాలు చేయడం సరైంది కాదన్నారు. పీఆర్సీ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవడం, అశుతోష్ మిశ్ర కమిటీ నివేదికను ఇస్తేనే ప్రభుత్వంతో చర్చలకు వెళ్లాలని నిర్ణయించామని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ వెల్లడించారు.
ఉద్యోగులకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని.. అందుకే వెంటనే పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని, లేక అభెయన్స్లో అన్నా పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ నెల పాత జీతాలు ఇవ్వాలని, జీవోలు రద్దు చేసే వరకు ఎలాంటి చర్చలకూ వచ్చేది లేదని తేల్చి చెప్పేశారు. జీవోలు రద్దు చేసిన తర్వాతే ఎవ్వరితోనైనా చర్చలకు వెళ్లాలని కమిటీ తీర్మానించింది.
ప్రభుత్వంతో ఘర్షణ పడాలన్న వైఖరి తమకు లేనప్పటికీ, ఘర్షణాత్మకమైన వైఖరిని తీసుకుని ప్రజలలో ఉద్యోగుల పట్ల చులకన భావన కలిగించే ప్రయత్నం చేసి, మరోవైపు చర్చలకు పిలవటంపై ఉద్యోగ సంఘాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ఇలాంటి విధివిధానాలు, స్పష్టత లేని కమిటీల వల్ల ఉద్యోగులలో నాయకత్వాల మీద ద్వేష భావాలు రగిలే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డాయి.
మొదటిసారి ఇరు జేఏసీలు ఇచ్చిన ఆందోళనను చర్చల కోసం తాత్కాలికంగా వాయిదా వేసిన సందర్భంలో కింది స్థాయి ఉద్యోగులు సైతం తమను నిందించారని, ఉద్యోగుల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారన్న పరుష వ్యాఖ్యలు చేస్తూ దుమ్మెత్తి పోశారని సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డిల దృష్టికి బొప్పరాజు, బండి తీసుకువచ్చారు. ఇక మీదట జాగ్రత్తగా ఉండాలన్న ఉద్దేశ్యంతో .. నాలుగు జేఏసీల నుంచి ఇద్దరేసి చొప్పున మొత్తం ఎనిమిది సభ్యులతో మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేశారు.
ఉద్యోగ సంఘాలను, ఉద్యోగులను కార్యకర్తలతో తిట్టించడం దారుణమని మండిపడ్డారు. వేతన సవరణ అనేది ప్రభుత్వం- ఉద్యోగులకు సంబంధించిన అంశమని ఏదైనా ఉంటే ప్రభుత్వం, ఉద్యోగులు కలిసి సమస్యను చర్చించుకుని పరిష్కరించుకోవాలే గానీ, పార్టీ కార్యకర్తలతో ఉద్యోగులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తిట్టించడం దారుణమని కమిటీ అభిప్రాయపడింది. వారి తిట్లకు దీ టుగా సమాధానం చెప్పాలనే అభిప్రాయం స్టీరింగ్‌కమిటీ సభ్యుల్లో వ్యక్తమైంది.
ప్రభుత్వం ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడినా.. సమ్మెకే మొగ్గు చూపించి పీఆర్సీ స్టీరింగ్ కమిటీ. ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి అంటే ఏడో తేదీ నుంచి సమ్మెకు వెళ్లాలని పీఆర్సీ సాధన కమిటీ నిర్ణయించింది. సీఎస్ కు సమ్మె నోటీసు ఇచ్చిన తరువాత ఉద్యమ కార్యాచరణపై సచివాలయ ఆవరణలోనే మీడియా సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
తమ ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఎలాంటి రాజకీయ పక్షాలను ఆహ్వానించటం లేదన్నారు. కేవలం పీడీఎఫ్ ఎమ్మెల్సీలు, కార్మిక సంఘాలను మాత్రమే ఆహ్వానించామన్నారు. ఉద్యమ కార్యాచరణతో ప్రభుత్వం ఏదో యుద్ధం జరుగుతున్నట్టుగా భావిస్తోందని... ప్రభుత్వాన్ని నమ్మినందుకు ఉద్యోగులకు జరిగిన అన్యాయం పట్ల బాధగా ఉందని సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి.