TTD: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి సేవ చేయడానికి మించిన భాగ్యం లేదన్నది భక్తుల నమ్మకం.. కానీ అయితే స్వామి వారి సేవ కోసం తిరుమల వెళ్లే అవకాశం అందరికీ ఉండడం లేదు. దీంతో స్వామి సేవలు వివిధ ప్ర్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలోనే నమూనా ఆలయాలు నిర్మించారు. అంతేకాదు పలు ప్రాంతాల్లో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తూ.. స్వామి దగ్గరకు భక్తులను రప్పిస్తున్నారు.
తిరుమల ఆలయంలో రోజువారీ నిర్వహించే సేవలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా టిటిడి పలు ప్రాంతాల్లో శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలను నిర్వహిస్తూ వస్తోంది. కరోనా కారణంగా రెండున్నర ఏళ్ల విరామం తరువాత నగరం నుంచి ఈ ఉత్సవాలను టిటిడి పునః ప్రారంభింస్తోంది. నేటి నుంచి ఆరు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.
నేటి ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు రెండో నివేదన చేపడతారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు సహస్రదీపాలంకార సేవ, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు వీధి ఉత్సవం, రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు రాత్రి కైంకర్యాలు, రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు ఏకాంతసేవ నిర్వహిస్తారు ఇలా విరామం లేకుండా ప్రత్యేక సేవలు జరుగుతాయి.
మరోవైపు తిరుమలలో వచ్చే నెల 27వ తేదీ నుంచి జరగనున్న వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది తిరుమల దేవస్థానం. సెప్టెంబరు 27 నుండి అక్టోబరు 5వ తేదీ వరకు అంగరంగ వైభవంగా ఈ వేడుకలను నిర్వహించేందుకు కసరత్తులు ఇప్పటికే మొదలయ్యాయి. అయితే కరోనా కారణంగా రెండేళ్ల తరువాత మాడ వీధుల్లో వాహనసేవలు నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
బ్రహ్మోత్సవాల తొలిరోజు ధ్వజారోహణం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మోహన్ రెడ్డి స్వామివారికి పటువస్త్రాలు సమర్పిస్తారు. అక్టోబరు 1న గరుడ సేవ జరుగనుంది. అయితే సాధారణ రోజుల్లోనూ దాదాపు లక్ష వరకు భక్తులు వస్తున్నారు. దీంతో బ్రహ్మోత్సవాలకు ఈ సారి భక్తుల సంఖ్య ఊహించని విధంగా పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది.