GT Hemanth Kumar, Tirupathi, News18 . Tirumala Arjit Seva: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. సుమారు రెండేళ్ల తర్వాత శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవల్లో భక్తులు పాల్గొనేలా అవకాశాన్ని కల్పిస్తోంది. కరోనా కేసులు తగ్గిపోయిన క్రమంలో తిరుమలలో అధికారులు పాత పద్ధతులను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే 2020 మార్చి 20న రద్దు చేసిన ఆర్జిత సేవలకు రేపటి నుంచి భక్తులను తిరిగి అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది.
తిరుమలలోని సీఆర్వో కార్యాలయంలో కౌంటర్లను సిద్ధం చేస్తోంది టీటీడీ. ఈ సేవలు సైతం రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 11 గంటల నుంచి 5 గంటల దాకా భక్తులు తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్ రెడీ తిరుమలలో ఉన్న వారు.. ఆఫ్ లైన్ ద్వారా ఈ సేవను వినియోగించుకోవచ్చు.. సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉంది.
సాయంత్రం 6 గంటలకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా భక్తులకు సేవను కేటాయిస్తారు. అడ్వాన్స్ బుకింగ్‌లో ఆర్జితసేవలు పొందిన భక్తులు రాకపోతే ఆ టికెట్లను కరెంట్ బుకింగ్ కోటాకు మళ్లించి రాత్రి 8.30 గంటలకు రెండవ డిప్ ద్వారా భక్తులకు కేటాయిస్తారు. వీరు రాత్రి 11 గంటలలోపు టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
దీనికి సంబంధించి సిఆర్వో జనరల్ కౌంటర్లలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు రెండేళ్ల తరువాత ఈ విధానాన్ని టిటిడి తిరిగి ప్రారంభిస్తుండడంతో వీటికి ఫుల్ డిమాండ్ కనిపిస్తోంది. స్వామివారి సేవ కోసం కోట్లాది మంది భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్దేశించిన వివిధ ఆర్జిత సేవా టికెట్ల కోసం యాత్రికులు తిరుమలలోని కరంట్ బుకింగ్ కౌంటర్లో ఉదయం 11 నుండి సాయంత్రం 5 గంటల మధ్య నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
అక్కడ టోకెన్ తీసుకున్న వారికి.. రెండు అక్నాలెడ్జ్మెంట్ స్లిప్‌లు వస్తాయి. ఒక స్లిప్ యాత్రికుడికి అందిస్తారు. ఇందులో వారి నమోదు సంఖ్య, సేవ తేదీ, వ్యక్తి పేరు, మొబైల్ నంబర్ మొదలైనవి ఉంటాయి. మరొక స్లిప్ రెఫరెన్స్ కోసం కౌంటర్ సిబ్బంది తీసుకుంటారు. గృహస్తుల సమక్షంలో సాయంత్రం 6 గంటలకు ఆటోమేటెడ్ రాండమైజ్డ్ నంబరింగ్ సిస్టమ్ ద్వారా ఎల్ఇడి స్క్రీన్లలో మొదటి డిప్ తీస్తారు.
ఏప్రిల్ 2వ తేదీన ఉగాది పురస్కరించుకుని కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఏప్రిల్ 10న శ్రీరామనవమి రోజున తోమాల, అర్చన, సహస్రదీపాలంకరణ సేవలు, ఏప్రిల్ 14 నుంచి 16 వరకూ కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు, ఏప్రిల్ 15న నిజపాద దర్శనం సేవల్ని రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.