Tirumala: కలియుగ వైకుంఠం తిరుమల లో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు అలర్ట్.. సూర్యుడి జన్మదినం సందర్భంగా జనవరి 28న రథసప్తమిని ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధం అవుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం.. ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి.. వాటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి.
శ్రీ మలయప్ప స్వామి సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఉదయం నుండి రాత్రి వరకు ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. మధ్యాహ్నం చక్రస్నానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా 28శ తేదీన తిరుపతిలోని కౌంటర్లలో సర్వ దర్శనం టైంస్లాట్ టోకెన్లు రద్దు చేసినట్టు అధికారులు సూచించారు.
రథసప్తమి రోజున వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవాలి. విఐపి బ్రేక్, ఆర్జిత సేవలు, వృద్ధులు, దివ్యాంగులు తదితర ప్రత్యేక దర్శనాలు రద్దు చేసినట్టు చెప్పారు. జనవరి 27, 28 తేదీల్లో వసతి గదుల ముందస్తు బుకింగ్ రద్దు. వసతి కేటాయింపు కోసం ఈ రెండు రోజుల్లో సిఆర్వో జనరల్ కౌంటర్లు మాత్రమే పనిచేస్తాయి.
రోజువారీ 3.5 లక్షల లడ్డూల తయారీతో పాటు 4 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్‌గా ఉంచుతారు. తిరుమలలోని గ్యాలరీలు, వైకుంఠం క్యూ కాంప్లెక్సు 1, 2, నారాయణగిరి షెడ్లు, క్యూ లైన్లు, మినీ అన్నప్రసాదం కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, టి, కాఫీ, పాలు పంపిణీ చేస్తారు.