TTD Alert: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వారి భక్తులకు బిగ్ అలార్ట్.. ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనానికి భారీ ఏర్పాట్లు చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం.. గతంలో కంటే ఎక్కువ మంది సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు వీలుగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ప్రకటించారు.
ఈ సారి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో.. రోజుకు దాదాపు 80 వేల మందికి దర్శనం కల్పించాలని నిర్ణయించారు. అలాగే ఆర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు. అన్నిరకాల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేసింది. శ్రీవాణి, ఎస్ఇడి టిక్కెట్లు, ఎస్ఎస్డి టోకెన్లు కలిగి ఉన్న భక్తులకు “మహా లఘు దర్శనం” చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు.
తిరుమల స్థానికుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన కౌంటరుతో పాటు తిరుపతిలోని తొమ్మిది కేంద్రాల్లో రోజుకు 50 వేలు చొప్పున మొత్తం ఐదు లక్షల ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేస్తారు. ఆధార్ కార్డ్ తప్పనిసరిగా చూపి ఈ టోకెన్లు పొందాల్సి ఉంటుంది. ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేసే తొమ్మిది ప్రదేశాలను రెండు క్లస్టర్లుగా విభజించి జెఇఓలు పర్యవేక్షిస్తారు.
వసతి
నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి దృష్ట్యా డిసెంబర్ 29 నుండి జనవరి 3 వరకు వసతి అడ్వాన్స్ బుకింగ్ రద్దు చేస్తారు. గదుల కేటాయింపులో పారదర్శకత పెంచేందుకు మరిన్ని కౌంటర్లు పెంచి సిఆర్వోలో మాత్రమే కేటాయిస్తారు. అలాగే వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జనవరి 2న తిరుమలలోని నాద నీరాజనం వేదికపై అఖండ విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించనున్నారు.
ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య స్వర్ణరథం ఊరేగింపు ఉంటుంది. జనవరి 3వ తేదీన వైకుంఠ ద్వాదశి రోజున స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటిలో శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ స్నపనం అనంతరం చక్రస్నానం చేస్తారు. అన్ని కార్యక్రమాలను ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
అదేవిధంగా, సందర్భానుసారంగా పుష్పాలంకరణలు చేయనున్నారు. శ్రీవారి సేవకులు, ఎన్సిసి క్యాడెట్లతో భక్తులకు సేవలందించనున్నారు.