హిందూ ధర్మపరిరక్షణలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం పలు ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఒంగోలు నగర శివారులోని క్విజ్ ఇంజినీరింగ్ కళాశాల ఎదురుగా ఉన్న మైదానంలో బుధవారం రాత్రి టీటీడీ ఆధ్వర్యంలో దాత , శాసన సభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి నిర్వహించిన శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.
రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, కంకణధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మధుపర్క సమర్పణ, మహాసంకల్పం, మంగళసూత్రధారణ ఘట్టాలతో శాస్త్రోక్తంగా కల్యాణాన్ని నిర్వహించారు. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది.
ఈ సందర్భంగా కల్యాణంలోని ఆయా ఘట్టాలకు అనుగుణంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. శోభారాజ్, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ మధుసూదన్ రావు బృందం అన్నమయ్య సంకీర్తనలను వీనులవిందుగా గానం చేశారు. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని తిలకించిన వేలాది మంది భక్తజనం చేసిన గోవిందనామ స్మరణతో వేదిక ఆవరణం మార్మోగింది.
భక్తులందరు శ్రీవారి కల్యాణాన్ని చూసేందుకు వేదిక ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో ఎల్ ఈ డి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, అర్చక బృందం నిర్వహించిన శ్రీనివాస కల్యాణ కార్యక్రమంలో దాత, శాసన సభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి దంపతులతో పాటు మంత్రి శ్రీమతి విడదల రజని, ఎంపిలు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శ్రీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మరోవైపు భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారు శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. న్యూఢిల్లీలో వారికి తిరుమల వేదపండితులు శ్రీవారి ఆశీస్సులను అందించారు. ఈ సందర్భంగా టిటిడి చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి కలిసి గౌ.ప్రధాన న్యాయమూర్తికి శ్రీవారి తీర్థప్రసాదాలు, టిటిడి క్యాలెండర్, డైరీ అందించారు.