Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో (Tirumala Temple) నిత్యం ఏదో కైంకర్యాల రూపంలో భక్తులకు దర్శనం ఇస్తూనే ఉన్నారు. తాజాగా ఆదివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ (Pournami Garuduseva) వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు.
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.
ఈ గరుడ సేవా కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ రమేష్‌బాబు, విజివో శ్రీ బాలిరెడ్డి, పేష్కార్ శ్రీ శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహోత్సవాలను అత్యద్భుతంగా నిర్వహించారని, టీటీడీ అందిస్తున్న సౌకర్యాలు బాగున్నాయని పలువురు భక్తులు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డిని ప్రశంసించారు.
తిరుమలలో రద్దీ అధికంగా ఉంది. విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఉన్న విధంగా విఐపి లకు ఒక క్యూ లైన్, సామాన్య భక్తులకు ఒక క్యూ లైన్ ఏర్పాటు చేయగలరని భక్తులు కోరారు. తిరుమలలో అత్యద్భుతమైన క్యూలైన్ వ్యవస్థ కొనసాగుతోందన్నారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం క్యూలైన్, ఈ క్యూలు రెండు వైకుంఠం వద్ద కలిసి భక్తులు శ్రీవారి దర్శనానికి వెళ్తన్నారు.
దర్శన్ కౌంటర్లలో దర్శన టికెట్లు ఇచ్చే పద్ధతిని పునః ప్రారంభించండని భక్తులు కోరారు. అయితే ఇంటర్నెట్లో రోజుకు 25వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం 300 రూపాయల టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచిందన్నారు. అలాగే ఈ దర్శన్ కౌంటర్లలో క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండకుండా ఇంటర్నెట్ ద్వారా ఇంటి నుండే బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రతి రోజు 50 వేల మంది భక్తులకు సర్వదర్శనం కల్పిస్తున్నామన్నారు.
క్యూ లైన్లలో టీటీడీ సేవలు చాలా బాగున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులను ఒక చోట నిలబెట్టి వాహన సేవలు వీక్షించేందుకు వదిలితే బాగుంటుందని భక్తులు కోరారు. ఇప్పటికే గరుడసేవనాడు హారతులు ఇచ్చే పద్ధతి మార్చి, నాలుగు మూలలా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి 50 వేల మందికి దర్శనం కల్పించామన్నారు. మిగిలిన వాహన సేవలో రద్దీ తక్కువగా ఉంటోంది అన్నారు.
నిత్యం తిరుమలలో రద్ధీ అధికంగా ఉంటోంది. తిరుపతిలో ఎస్ఎస్డి టోకెన్ల కౌంటర్లు ఏర్పాటు చేయగలరని భక్తులు కోరారు. అలాగే అలిపిరి నడక మార్గంలో గాలి గోపురం దగ్గర దివ్యదర్శనం టోకెన్లను పునః ప్రారంభించండని భక్తులు కోరారు. టీటీడీ బోర్డు నిర్ణయం మేరకు త్వరలో దివ్యదర్శనం టోకెన్లు బదులు తిరుపతిలో ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేస్తామన్నారు.