Tiruchanoor: భారత దేశంలో ఎక్కడా లేని విధంగా లక్ష్మీ దేవికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ వస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం.. ఆనవాయితీలో భాగంగా ఈ ఏట నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈ నెల 20 ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో రికార్డు స్థాయిలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
సర్వాలంకార శోభితమైన రథంలో ప్రకాశించే అలమేలు మంగ సకలదేవతా పరివారంతో వైభవోపేతంగా తిరువీధులలో విహరించే వేళలో ఆ తల్లిని సేవించిన భక్తుల కోరికలు సిద్ధిస్తాయన్నది భక్తుల విశ్వాసం. రథోత్సవం ఉత్సవం మాత్రమే కాదు. భక్తుల హృదయక్షేత్రాలలో తాత్త్వికబీజాలు విత్తే ఒక యజ్ఞం.సింగారించిన పాలకడలి గారాలపట్టిని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుందని నమ్ముతారు.
అశ్వం వేగంగా పరిగెత్తే అందమైన జంతువు. అందుకే ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా అభివర్ణిస్తున్నాయి. పరమాత్ముడైన హరి పట్టపురాణి అలమేలుమంగ అశ్వవాహన సేవను దర్శించిన భక్తులకు కలిదోషాలను తొలగిపోతాయని విశ్వాసం.వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్, ఎమ్మెల్యే , టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీ మారుతి ప్రసాద్, శ్రీ రామేశ్వరరావు, శ్రీ సంపత్ నారాయణ, జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం పాల్గొన్నారు.