Tiruchanoor: భారత దేశంలో ఎక్కడా లేని విధంగా అమ్మవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తోంది టీటీడీ. తిరుచానూర్ లో వెలసిన శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు రంగ రంగ వైభంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారు ఆరో రోజు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉదయం సర్వభూపాల వాహనంపై వెన్న ముద్ద కృష్ణుడి అలంకారంలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. సాయంత్రం అమ్మవారు స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఇక రాత్రి గరుడ వాహనంపై లోకమాత భక్తులను కటాక్షించారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శుక్రవారం ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై వెన్న ముద్ద కృష్ణుడి అలంకారంలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. కృష్ణుడి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తిరుచానూరు చేరుకుని.. అమ్మ దర్శన భాగ్యం దక్కించుకున్నారు.
శ్రీవారి హృదయపీఠంపై నిలిచి లోకాన్ని కటాక్షిస్తున్న అలమేలుమంగ. సర్వభూపాలురు వాహనస్థానీయులై అమ్మవారిని సేవించి తరిస్తున్నారు. ఇందులో అష్టదిక్పాలకులు ఉన్నారు. వీరంతా నేడు జగదేకవీరుడైన శ్రీవారి అర్ధాంగిని సేవించి తరిస్తున్నారు. మధ్యాహ్నం 12 నుండి 2 గంటల వరకు శ్రీ కృష్ణ స్వామి ముఖ మండపంలో అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు.
రెండేళ్ల తరువాత మాడవీధుల్లో అమ్మవారిని భక్తుల మధ్య ఊరేగించారు. కాంతులీనుతున్న స్వర్ణ రథంపై శ్రీ పద్మావతి అమ్మవారు విశేష స్వర్ణ, వజ్రాభరణాలను ధరించి భక్తులకు కనువిందు చేశారు. పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొని స్వర్ణరథాన్ని లాగారు. ఈ సేవలో పాల్గొంటే అన్ని సమస్యలు తొలిగిపోతాయి అన్నది భక్తుల నమ్మకం.
తిరుచానూరులో అమ్మవారికి గరుడ సేవ జరుగుతున్నపుడు శ్రీవారు తన గుర్తుగా అమ్మవారికి తన బంగారు పాదాలను పంపుతున్నారు. గరుడుడు నిత్యసూరులలో అగ్రేసరుడు. గరుడుని రెండు రెక్కలు జ్ఞాన వైరాగ్యాలకు చిహ్నాలుగా పురాణాలు చెబుతున్నాయి. శ్రీవారు, అమ్మవారిని గరుడాళ్వార్లు దాసుడిగా, చాందినీగా, ఆసనంగా, వాహనంగా సేవిస్తున్నారు.