Tiruchanoor: శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సోవారం పంచమీ తీర్థం అంటే.. చక్రస్నానం నిర్వహించారు. ఈ పంచమీ తీర్థం అశేష భక్తజనవాహిని మధ్య రంగరంగ వైభవంగా జరిగింది. పద్మ పుష్కరిణిలో స్నానం ఆచరించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు.
ఉదయం 6.30 గంటల నుండి 7.30 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకిలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. తరువాత అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా పంచమీ తీర్థ మండపానికి వేంచేపు చేశారు. గత రెండేళ్లు కరోనా కారణంగా అమ్మవారిని ఉత్సవాలను తిలకించలేకపోవడంతో.. ఈ సారి అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది.
తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర తెల్లవారు జామున 4.30 గంటలకు బయలుదేరిన సారె ఉదయం 11 గంటలకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుంది. అర్చకులు పంచమి తీర్థ మండపంలో సారెను అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు జరిపారు.
శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం సందర్బంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారు కానుకలు పంపారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సోమవారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారె సమర్పించారు. ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారె తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవారి ఆలయంలో జరిగిన కార్యక్రమంలో టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి పాల్గొన్నారు.
ముందుగా శ్రీవారి ఆలయంలో ఉదయం 2.30 నుండి పరిమళాన్ని(నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన మిశ్రమం) విమాన ప్రాకారంలో ఊరేగింపు చేపట్టారు. తరువాత శ్రీవారి వక్ష:స్థల లక్ష్మీ అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం నిర్వహించారు.
తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణంతో కూడిన సారె ఊరేగింపు మొదలైంది. ఈ సారెను గజాలపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా ఊరేగించి తరువాత కాలినడకన తిరుమల నుంచి తిరుపతిలోని అలిపిరి వద్దకు తీసుకెళ్లారు. అక్కడినుండి కోమలమ్మ సత్రం, శ్రీ కోదండరామాలయం, శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, లక్ష్మీపురం సర్కిల్, శిల్పారామం నుండి తిరుచానూరు పసుపు మండపం మీదుగా ఆలయం వద్ద అమ్మవారికి సారె సమర్పించారు.
బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం . విషమృత్యు నాశనం, రాజ్యపదవులవంటి సకల శ్రేయస్సులు పొందుతారని విశ్వాసం. ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఏఈఓ శ్రీ ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ దాము పాల్గొన్నారు.