పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే చాలా చోట్ల ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ముఖ్యంగా వైసీపీ నేతలు బయట నుంచి బస్సుల్లో దొంగ ఓటర్లను రప్పిస్తున్నారని.. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. మరోవైపు టీడీపీ ఏజెంట్లను కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం సరళి చూస్తుంటే భారీగానే పోలింగ్ నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుపతి పార్లమెంట్ పరిధిలో నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట అసెంబ్లీ సెగ్మెంట్లు, చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ ఏడు నియోజకవర్గాల పరిధిలో 2,470 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్ల సంఖ్య 17,11,195 మంది కాగా.. వీరిలో మహిళా ఓటర్లు 8,38,540 మంది ఉన్నారు.
తిరుపతి పోలింగ్ లో కొన్ని చోట్ల అవాంతరాలు తప్పడం లేదు. వాకాడు మండలం నిడిగుర్తి పోలింగ్ బూత్ లో ఈవీఎం మొరాయించడంతో పోలింగ్ నిలిచిపోయింది. ఈవీఎంకు బ్యాటరీలు లేకపోవడంతో పోలింగ్ నిలిచిపోయిందని.. ఇది సిబ్బంది నిర్లక్ష్యాన్ని నిదర్శనమని అక్కడి ఓటర్లు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు తిరుపతి పోలింగ్ బూత్ దగ్గర టిడిపి కార్యకర్తలతో తిరుగుతున్న టిడిపి నేతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.