Tiruchanoor: దేశంలోనే ఎక్కడా లేని విధంగా లక్ష్మీమాతకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తోంది టీటీడీ. అందులో భాగంగా తిరుచనూరులో వైభంగా శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నిర్వహించారు.. ఆ బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుచటి రోజు ఆనవాయితీలో భాగంగా అమ్మవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం నేత్ర పర్వంగా జరిగింది.
ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు భక్తి పారవశ్యంతో తన్మయత్వం చెందారు. బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల కారణంగా భక్తుల కారణంగా కానీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
గత పది రోజులుగా తిరుచానూరుకు భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం అంటేనే పరమపవిత్రమైనది.. అందులోనే అమ్మవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుండడంతో భారీగా భక్తులు చేరుకున్నారు. ప్రస్తుతం మార్గశిర మాసం.. ఇది కూడా లక్ష్మీదేవికి అంత్యంత ప్రీతికరమైన మాసం.. దీనికి తోడు పుష్పయాగం నిర్వహిస్తుండడంతో అనూహ్యంగా భక్తుల రద్దీ భారీగా పెరిగింది.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ మారుతి ప్రసాద్, శ్రీ మిలిన్ కేశవ్ నర్వేకర్, శ్రీ బోరా సౌరబ్ , జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, గార్డెన్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, గార్డెన్ మేనేజర్ శ్రీ జనార్ధన్ రెడ్డి, ఆర్థితం ఇన్స్పెక్టర్ శ్రీ దాము పాల్గొన్నారు.