Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో భోగీ, సంక్రాంతి, కనుమ మూడు రోజులు ప్రత్యేక ఉత్సవాలు ఘనంగా సాగాయి.. కనుమ రోజు ప్రత్యేకంగా నిర్వహించిన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవము అత్యంత వైభవంగా సాగింది. పండుగ సమయంలోనూ భారీగా భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.
శ్రీ మలయప్పస్వామివారు ఉత్సవం పూర్తియిన తరువాత మహాద్వారమునకు వచ్చి హత్తీరాంజీవారి బెత్తమును తీసుకొని సన్నిధిలోనికి వేంచేసారు. అక్కడితో ఎంతో వేడుకగా జరిగే పార్వేట ఉత్సవం ఘనంగా ముగిసింది. ఈ ఉత్సవంలో జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, ఎస్ ఇ -2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
అలాగే 19వ తేదీన శ్రీ నవగ్రహ హోమం నిర్వహిస్తారు. జనవరి 20న శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమం జరగనుంది. జనవరి 21న శ్రీ రుద్ర , శ్రీ మృత్యుంజయ స్వామి వారి హోమాలు నిర్వహించనున్నారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు నిర్వహిస్తున్న హోమ మహోత్సవాల్లో చైర్మన్ దంపతులతో పాటు, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, డిప్యూటి ఈవో శ్రీ దేవేంద్ర బాబు, ఎఈవో శ్రీ పార్థ సారధి పాల్గొన్నారు.
మరోవైపు తిరుపతి శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో కనుమ పండుగ సందర్భంగా సోమవారం గోపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుండి వేణుగానం, 8 నుండి 9 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర వేదపాఠశాల విద్యార్థులు వేద పారాయణం జరిపారు. ఉదయం 8 నుండి 10.30 గంటల వరకు దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భజన, కోలాటాలు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు.