తాజాగా తిరుపతిలో వరద బాధితులకు చెక్కులు పంపిణీ చేసిన సందర్భంగా నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు బాధించాయని.. ఆ సమయంలో కుటుంబం తనకు అండగా నిలిచిందన్నారు. తన భర్త కన్నీళ్లు పెట్టుకోవడం మరింత బాధపెట్టిందని వ్యాఖ్యనించారు. అదే సమయంలో వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారామె.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఓ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా వల్లభనేని వంశీ.. భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపరిచారంటూ టీడీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. ఆ తర్వాత వల్లభనేని వంశీ.. భువనేశ్వరికి సారీ చెప్పారు. ఐతే వారు క్షమాపణలు చెప్తారని తాను ఎదురుచూడటం లేదన్నారామె.
ఇక తిరుపతిలో వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున భువనేశ్వరి లక్ష రూపాయల చొప్పున చెక్కులు అందజేశారు. దేశంలో ఎలాంటి కష్టాలు వచ్చినా ఎన్టీఆర్ ట్రస్ట్ తోడుంటుందన్నారు. అలాగే హెరిటేజ్ సంస్థను కూల్చివేసేందుకు చాలా మంది యత్నించారని.. కానీ ఎవరూ హెరిటేజ్ టచ్ చేయలేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారమె.