కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు (Sri Venkateswara Swamy) కొలువైయున్న పవిత్ర క్షేత్రం తిరుమల (Tirumala). సప్తగిరులపై నిత్యం గోవింద నామస్మరణ వినిపిస్తుంటుంది. ఏవైపు చూసినా ఆ శ్రీనివాసుడే దర్శనమిస్తాడు. శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. అందుకే టీటీడీ (TTD) వారికి అన్ని సౌకర్యాలను కల్పిస్తోంది.
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా ఆధ్యాత్మిక భావనను అడుగడునా ఉట్టిపడేలా చేసేదుకు ఎస్వీబిసి ఛానెల్ ప్రసారం చేసే ఎల్ఈడీ స్క్రీన్ లలో సినిమా పాటలు ప్రసారం అయ్యాయి. తిరుమలలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ లో శుక్రవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో అధ్యాత్మిక కార్యక్రమాలకు బదులుగా స్క్రీన్ పై ఒక్కసారిగా సినిమా పాటలు ప్రసారం కావడాన్ని చూసిన భక్తులు షాక్ కు గురి అయ్యారు.
దాదాపు అరగంట పాటు సినిమా పాటలను ఎస్వీబీసీ సిబ్బంది ప్రసారం చేసారు.. ఓ వైపు టీటీడీ బ్రాడ్ క్యాస్టింగ్ లో గోవింద నామాలు వినపడుతుండగా, మరోవైపు స్క్రీన్ పై సినిమా పాటలు రావడాన్ని భక్తులు తప్పుబడుతున్నారు. తిరుమల శ్రీవారి ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన ఎస్వీబీసీ ఛానల్ లో సిబ్బంది నిర్లక్ష్యం పై భక్తులు కేకలు వేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.