Tirumala: కలియుగ వైకుంఠంగా పిలుచుకునే తిరుమలలో శ్రీ రామ నవమి వేడుకలు ఉత్సాహంగా జరుగుతునే ఉన్నాయి. నేడు శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా గురు వారం.. హనుమంతుడి పై శ్రీ వెంకటాద్రి రాముడు ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు.. ఆ రూపాన్ని చూడడానికి తమ రెండు కళ్లూ సరిపోలేదు అంటున్నారు భక్తులు.
శ్రీరాములవారు తన భక్తుడైన హనుమంతునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. శ్రీ వేంకటేశ్వరుణ్ణి శ్రీరాముడిగా భావించి, శ్రీవారి సుప్రభాతాన్ని రచించిన శ్రీ హస్తిగిరినాథన్ ''కౌసల్యా సుప్రజా రామ..'' అంటూ స్తుతించారు. రామాయణంలోని శ్రీరాముడే ద్వాపరయుగంలో శ్రీక ష్ణుడు, ఆ శ్రీక ష్ణుడే కలియుగంలో శ్రీనివాసుడు అన్నది భక్తుల నమ్మకం.
శ్రీవారు వేంకట రాముడు, వేంకట కృష్ణుడు, వేంకటాచలపతి ఇలా త్రివేణిసంగమయిన సేవ హనుమంత వాహనసేవ అంటారు. దాస్యభక్తుల్లో హనుమంతుడు పేరెన్నికగన్నవాడని గుర్తింపు ఉంది. అంతేకాదు వేదాలూ, వ్యాకరణాలూ సమస్తమూ క్షుణ్ణంగా తెలిసినవాడు హనుమంతుడు. అందుకే హనుమంతుడిని సేవించినా.. భక్తితో దర్శించినా..? భక్తులకు బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, చైతన్యం, మంచి వాక్శక్తి సిద్ధిస్తాయని పండితులు చెబుతారు.
ఉదయాన్ని రామచంద్ర మూర్తికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఉదయం 9 నుండి 11 గంటల వరకు రంగనాయకుల మండపంలో శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం కన్నులపండువగా సాగింది.
స్నపన తిరుమంజనంలో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం నిర్వహించారు.
భక్తులు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూసే.. శ్రీరామ పట్టాభిషేకాన్ని నేడు ఘనంగా నిర్వహించనున్నారు. రాత్రి 8 నుండి 9 గంటల మధ్యలో.. తిరుమలలోని బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ వేడుకకు వేలాదిగా భక్తులు తరలి రానున్నారు. టీవీల్లోనూ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
మరోవైపు చంద్రగిరి శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో గురువారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సకలదేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 7.45 నుండి 8.15 గంటల మధ్య మేష లగ్నంలో ధ్వజారోహణం ఘట్టాన్ని నిర్వహించారు.
ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల రామనామస్మరణ మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారు. కంకణభట్టార్ శ్రీ శ్రీనివాసభట్టార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు, ఏఈవో శ్రీ పార్థ సారధి, సూపరిండేంట్ శ్రీ శ్రీనివాసులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ గోపాల కృష్ణ, భక్తులు పాల్గొన్నారు.