Tiruma: కలియుగవ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి (Lord Venkateswara Swamy) దర్శన భాగ్యం కోసం లక్షాలది మంది నిత్యం ఎదురు చూస్తుంటారు. అయితే ఒక్కసారి స్వామి వారిని దర్శించుకుంటే తమ కోరికలు నెరవేరుతాయని..? ఎన్నో జన్మల పుణ్యఫలం వస్తుందని నమ్ముతారు. మరికొందరు అయితే స్వామి వారికి భారీగా విరాళలు అందించి మరి ఆయనను సేవిస్తారు. ఇక ఈ నెల రోజుల్లో రికార్డు స్థాయిలో స్వామి వారికి విరాళాలు అందాయి.
ఇక టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నంద కుమార్ శుక్రవారం సాయంత్రం సుమారు దాదాపు 27 లక్షలు విలువైన ఇన్నోవా క్రిస్టా వాహనాన్ని విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయం ముందు పూజలు నిర్వహించిన అనంతరం టీటీడీ ఈవో శ్రీ ఎవి. ధర్మారెడ్డికి తాళాలు అందజేశారు.
టీటీడీ రవాణా విభాగం తిరుమల డీఐ శ్రీ జానకిరామిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అంతకుముందు తిరుమల శ్రీవారికి టయోటా రైడర్ హైబ్రీడ్ పెట్రోల్, అలాగే బ్యాటరీతో నడిచే కారును విరాళంగా అందించారు. అది కూడా నెల్లూరుకు చెందిన హర్ష టయోటా కార్ల కంపెనీ ఎండి శ్రీ ఎం.హర్షవర్థన్ అందించారు. దాని విలువ దాదాపు 19 లక్షలు ఉంటుంది. శ్రీవారి ఆలయం ఎదుట వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తాళాలను టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.
అలాగే కరూర్ వైశ్యా బ్యాంక్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్ )లో భాగంగా గురువారం ఉదయం టీటీడీకి సుమారు 30 లక్షల విలువైన 8-సీట్లు కలిగి బ్యాటరీతో నడిచే ఐదు వాహనాలను విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయం ముందు వాహనాలకు పూజలు నిర్వహించిన అనంతరం కెవిబి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బి.రమేష్ బాబు టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డికి బ్యాటరీ వాహనాల తాళాలు అందజేశారు.
సెప్టెంబర్ నెలలో టీటీడీ ఆధ్వర్యంలోని వివిధ ట్రస్టు లకు హైదరాబాద్ కు చెందిన దాత శ్రీమతి వెల్లంకి రాజ రాజేశ్వరి దేవి 15 లక్షల 1116 విరాళంగా అందించారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో జెఈవో శ్రీమతి సదా భార్గవికి దాత ఈ మేరకు డిడిలు అందజేశారు.
తన భర్త స్వర్గీయ వెల్లంకి చక్రపాణి జ్ఞాపకార్థం విద్యాదానం ట్రస్టు కు రూ 10 లక్షల 1116, తన మనవళ్ళు , మనవరాళ్ళ పేరు మీద గో సంరక్షణ ట్రస్టుకు రూ 2 లక్షలు , అన్నదానం ట్రస్టు కు రూ 2లక్షలు , ప్రాణదానం ట్రస్టు కు రూ 1 లక్ష అందించారు.
ఇక తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి హైదరాబాద్కు చెందిన భక్తుడు శ్రీ సత్యనారాయణ స్వర్ణ పాదాలు విరాళంగా సమర్పించారు. ఆలయంలో జరిగే కల్యాణోత్సవంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తికి అలంకరించేందుకు ఈ పాదాలను అందించారు. 85 గ్రాముల బరువుగల ఈ పాదాల విలువ 4 లక్షలు అని భక్తుడు తెలిపారు.