ఆపద మొక్కులవాడు కొలువైయున్న దివ్య ధామం తిరుమల పుణ్యక్షేత్రం (Tirumala Temple). కలియుగంలో భక్తులను రక్షించే దైవంగా, సకల పాపాలనజ తొలగించే ఆనంద నిలయుడి దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలం. అందుకే ఏడుకొండల్లో నెలవైయున్న శ్రీ వేంకటేశ్వర స్వామి (Sri Venkateswara Swamy) వారి దర్శనంకు అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి క్షణకాలం పాటు జరిగే స్వామి వారి దివ్య మంగళ స్వరూపంను దర్శించనిదే తిరిగివెళ్ళరు.
స్వామి వారిపై భక్తితో తలనీలాలు సమర్పించి స్వామి వారి దర్శించి, వారి వారి స్దోమతకు తగ్గట్టుగా స్వామి వారికి కానుకలు సమర్పించి వెళ్తుంటారు భక్తులు. అయితే కోవిడ్ తరువాత గత కొంత కాలంగా తిరుమల పుణ్యక్షేత్రం భక్తుల కళకళ లాడుతుంది. ఎటు చూసిన భక్తుల గోవింద నామస్మరణలతో ఏడు కొండలు మారుమ్రోగుతున్నాయి. వేసవి సెలవులు (Summer Holidays), ఇంటర్మీడియట్ ఫలితాలు (Intermediate Results) విడుదల కావడంతో తిరుమల పుణ్యక్షేత్రం భక్తజన సంద్రంగా మారింది.
సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1,2 లోని కంపార్ట్మెంట్లు అన్ని భక్తులతో నిండి నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు భక్తుల నిండి పోవడంతో ఆళ్వార్ ట్యాంక్ మీదుగా లేపాక్షి సర్కిల్ నుండి నందకం అతిధి గృహం వరకూ భక్తులు క్యూలైన్స్ లో వేచి ఉన్నారు. గత కొద్ది రోజులు తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతుండంతో టిటిడి ఈవో ఏవి ధర్మారెడ్డి టిటిడి అధికారులతో తిరుమలలోని అన్నమయ్య భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు.
అధికారులు భక్తుల రద్దీ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, భక్తులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా టిటిడి ఈవో మాట్లాడుతూ.. శుక్రవారం క్యూ లైన్ ఆస్థాన మండపం దాటి, నందకం అతిధి భవనం వరకూ చేరుకుందని చెప్పారు. శనివారం కూడా రద్దీ క్రమేపీ పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులకు సదుపాయాల కల్పనలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
గత కొన్ని నెలలుగా గురువారం నుంచి ఆదివారం వరకు భక్తుల రద్దీ విపరీతంగా ఉంటోందని ఈవో వివరించారు. ఇందుకై ఆలయంలో, సన్నిధి నుండి వెండి వాకిలి, వెండివాకిలి నుండి మహద్వారం వరకు అదనంగా అధికారులను నియమించి, షిఫ్ట్ ల వారీగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. రద్దీ రోజుల్లో రోజుకు 90 వేల మందికి పైగా దర్శనం చేసుకుంటున్నారని ధర్మారెడ్డి చెప్పారు.
క్యూలోని భక్తులకు తాగునీరు, అన్న ప్రసాదాలు ఇబ్బంది లేకుండా అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.. క్యూ లైన్ల నిర్వహణలో టీటీడీ విజిలెన్స్ మరియు సెక్యూరిటీ అధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.. ఆరోగ్యాధికారి తిరుమలలో పరిశుభ్రతతో పాటు భక్తులకు నిరంతరాయంగా తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
రిసెప్షన్ అధికారులు గదుల కేటాయింపులో ఆలస్యం లేకుండా చూడాలన్నారు. క్యూ లైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, మరియు 2, నారాయణ గిరి ఉద్యానవనంలో వేచి ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు తాగునీరు, అన్నప్రసాదాలు అందించాలని చెప్పారు. తిరుమలలో వాహనాల రాక పోకల వల్ల ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కల్యాణకట్టలో రోజుకు సుమారు 40 వేల మంది భక్తులు తలనీలాలు సమర్పిస్తున్నారని, రద్దీకి తగినట్లు ఏర్పాట్లు చేయాలని టిటిడి ఈవో ఏవి. ధర్మారెడ్డి చెప్పారు.