Tirumala Tirupati: కలియుగ దైవం.. ఆపదమొక్కుల వాడు శ్రీనివాసుడు కొలువైన దివ్య పుణ్య క్షేత్రం తిరుమలకు భక్తులు ఊహించని స్థాయిలో పోటెత్తుతున్నారు. ఓ వైపు మాడు పగిలే ఎండ.. రోజులు తరబడి క్యూ లైన్లు ఉన్నా భక్తులు అవేమీ లెక్క చేయడం లేదు. సాధారణంగానే వేసవిలో భారీగా భక్తులు వస్తారు.. కానీ ఈ సారి ఊహించని విధంగా భక్తులు క్యూ కడుతున్నారు. ఇలాంటి సమయంలో ఆ భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది.
అయితే కరోనా అదుపులోకి వస్తున్న నేపథ్యంలో అనేక నిబంధనలను సడలిస్తూ.. కోనేటిరాయుడిని దర్శించుకోవడానికి భక్తులకు శుభవార్తలు చెబుతూనే ఉంది. తాజాగా ఎన్నారై భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. వెంకటనాథుడి దర్శనం కోసం తిరుమల తిరుపతి వచ్చే ప్రవాసభారతీయులకు దర్శనం విషయంలో కొన్ని వెసులుబాటులు కల్పించింది.
ముఖ్యంగా NRI భక్తులకు తిరుమల వైకుఠం క్యూ కాంప్లెక్స్-1 వద్ద ప్రత్యేక 300దర్శన టికెట్ల అమ్మకాన్ని తిరిగి కొనసాగిస్తూ..టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ నేపథ్యంలో ఆగిపోయిన ఈ సదుపాయాన్ని తిరిగి కొనసాగించనుంది. ప్రత్యేక దర్శన టికెట్లు కావాల్సిన ప్రవాసాంధ్ర భక్తులు VQC-1 వద్ద ఉన్న కౌంటర్లలో టికెట్లు పొందవచ్చు.