Varalakshmi Vratam: శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్నిఆచరించారిస్తారు. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేసుకోవచ్చు. వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవత లక్ష్మీదేవి.. ఈ వరలక్ష్మీ వ్రతం చేసిన వారికి ధన, కనక, వస్తు, వాహనాది ఫలాలు లభిస్తాయి. శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలు తొలిగి లక్ష్మీ ప్రసన్నం లభిస్తుందన్నది భక్తుల నమ్మకం.
ఈ శ్రావణమాసంలో అమ్మవారిని పూజించాలని భక్తుల నుంచి డిమాండ్ ఉండడంతో టీటీడీ కీలక నిర్ణయం ప్రకటించింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 5న శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుగుతుంది. ఇందుకోసం రూ.1,001/- చెల్లించి భక్తులు టికెట్ కొనుగోలు చేయవచ్చని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఒక టికెట్‌పై ఇద్దరు గృహస్తులను అనుమతిస్తారు.
ప్రతి హిందూ మహిళా వరలక్ష్మీ వ్రతాన్ని చిత్త శుద్ధితో చేస్తారు. భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది.
వ్రత విధానం
వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటుచేసుకోవాలి. అమ్మవారి ఫొటో లేదా రూపును తయారుచేసి అమర్చు కోవాలి. పూజాసామగ్రి, తోరాలు, అక్షతలు, పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి.
తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆవిధంగా తోరాలను తయారుచేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.