Beauty of Tirumala: ఇలా వైకుంఠంలో ఒక్కో రాయి వేదములే.. ఒక్కో అడుగు పవిత్రమే.. అందుకే వేదములే శిలలైనా తిరుమల కొండా అంటూ పదకవితా పితామహుడు అన్నయ్య కీర్తించారు. స్వామి వారి వైభవం తిరుమల కొండని చూస్తేనే ప్రతిభింబిస్తుంది. కొండంతా శ్రీవారి ఆకృతులే...? అందుకే ఆధ్యాత్మికత్వంతో పాటు.. ఆహ్లాదం మనసును కట్టిపడేస్తుంది. తాజాగా వర్షాలు.. మంచు తుంపరలతో తిరుమల అందం రెట్టింపు అయ్యింది.
తిరుమలలో గత రెండు రోజులుగా మండాస్ తుఫాను కారణంగా 210 ఎం.ఎం. వర్షం నమోదు అయిందని అధికారులు తెలిపారు. తిరుమలలోని ఆకాశ గంగా, పాపనాశం, గోగర్భం డ్యాం, కుమార ధర , పసుపుధార జలాశయాలు జల కళతో ఉట్టి పడుతున్నాయి.
అదేవిధంగా అక్కగార్ల గుడి వద్ద కురుస్తున్న జలపాతాలు, చెక్ డ్యాంల గుండా ప్రవహిస్తున్న నీటిని, ప్రకృతి రమణీయ దృశ్యాలను యాత్రికులు తమ సెల్ఫోన్లలో బంధిస్తున్నారు.
ఒక్కో అడుగు ఒక్కో దేవతామూర్తుల సహజ సిద్దమైన రూపాలగా ఏర్పడ్డాయి. అందుకే తిరుమల కొండ ఎంతో ప్రత్యేకమైనది. ఈ ప్రత్యేకతను చాటి చెప్పడానికే నిదర్శనంగా నిలుస్తోంది తిరుమలలోని శిలాతోరణం.
ఓ వైపు శంఖు, మరో వైపు చక్రాలను పోలి ఉన్న సాక్షాత్తు శ్రీ మహా విష్ణువు కృపతో ఏర్పడినట్లు పురాణాలు వర్ణిస్తున్నాయి. ప్రస్తుత వాతావరణం మరింత అందాన్ని పెంచుతోంది.
తిరుమలగిరుల్లో ప్రతి చెట్టు, ప్రతి రాయి శ్రీవారి స్వరూపమే.. తిరుమల అంటేనే స్వామి వారి తరువాత గుర్తుకు వచ్చేది ప్రకృతి అందాలు.. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనార్ధం నిత్యం వేల సంఖ్యలో భక్తులు దేశ విదేశాల నుండి తిరుమలకు చేరుకుంటారు.. తిరుపతిలోని అలిపిరి నుండి మొదలై ఎత్తైన కొండలు, లోయలు అడుగడుగునా భక్తులను కనువిందు చేస్తూనే ఉన్నాయి.
అలాగే శేషాచలం అటవీ ప్రాంతంలోని వన్య ప్రాణులు కూడా భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.. వీటికి మించి ప్రకృతి అందాలు భక్తులను ఎంత గానో మైమరపిస్తుంటాయి.. తిరుమలలోని ప్రతి అణువు దైవ రూపమే.. ఓ వైపు గోవిందనామ స్మరణతో ఆధ్యాత్మిక శోభ కనిపిస్తుంటే.. మరోవైపు మంచుతెరల చాటున అందాల భక్తులను కనువిందు చేస్తున్నాయి.
ఏడుకొండల్లో ఉండే అందాలు అనువనును ఆకట్టుకుంటూనే ఉన్నాయి.. పచ్చని చీర కట్టినట్టు అందాలు మరో లోకానికి తీసుకెళ్లాలా చేస్తున్నాయి. అయితే సాధారణంగా తిరుమల నిత్యం ఆధ్యాత్మిక భావనతో పాటు ఆహ్లాదాన్ని కూడా పంచుతుంది. అయితే ప్రస్తుతం వాతావరణ కూడా మరింత చల్లగా ఉండడంతో.. ఆ అందాలు మరింత రెట్టింపు అవుతున్నాయి.