ఆలయం మూసి వేయడంతో పాటు.. 8వ తేదీన ప్రత్యేక సేవలను కూడా రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. చంద్రగ్రహణం రోజు కూడా భారీగానే భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో.. 12 గంటల తరువాత ఆలయం తెరిచినా..? బ్రేక్ దర్శనం, శ్రీవాణి, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఇతర ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.
చంద్రగ్రహణం నేపథ్యంలో ఉదయం 8.40 నుండి రాత్రి 7.20 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. సాధారణంగా గ్రహణం రోజుల్లో గ్రహణం తొలగిపోయే వరకు వంట చేయరు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇతర ప్రాంతాల్లో కూడా అన్నప్రసాద వితరణ ఉండదు. తిరిగి రాత్రి 8.30 గంటల నుండి భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభమవుతుంది.
దీంతోపాటు తిరుమల నుండి వచ్చే శ్రీవారి సారె ఊరేగింపు ట్రయల్ రన్ గురువారం నిర్వహించారు. అనంతరం తోళప్ప గార్డెన్స్‌లో గల అన్నప్రసాద భవనం సమావేశ మందిరంలో పంచమి తీర్థం ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సిబ్బంది ఆదేశించారు.
స్థానిక పోలీసుల సహకారం తీసుకుని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ముఖ్యంగా ఈ ఊరేగింపులో ఏనుగులు బెదరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పుష్కరిణిలోకి వెళ్లేందుకు, తిరిగి వెలుపలికి వచ్చేందుకు ఎన్ని గేట్లు ఉన్నాయి, రెండోసారి భక్తులు ప్రవేశించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, పుష్కరిణి వద్ద భద్రత ఏర్పాట్లపై చర్చించారు.
అలాగే భక్తులు వేచి ఉండేందుకు షెడ్లు ఏర్పాటు చేయాలని, అక్కడ అన్నప్రసాదాలు, తాగునీరు, అదనంగా తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. మరోవైపు తిరుపతిలోని చెన్నారెడ్డి కాలనీలో గల శ్రీ వినాయక స్వామివారి ఆలయం నుండి శ్రీవారి సారె ఊరేగింపు ట్రయల్ రన్ మొదలైంది. అక్కడి నుండి ఏనుగుపై సారెను ఊరేగింపుగా తీసుకొచ్చారు.
ముందుగా శ్రీ కోదండరామాలయం, చిన్నబజారు వీధి, పాత హుజుర్ ఆఫీస్, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం, బండ్ల వీధి, ఆర్టిసి బస్టాండు, పద్మావతి పురం, మార్కెట్ యార్డు, శిల్పారామం మీదుగా తిరుచానూరులోని పసుపు మండపం వద్దకు చేరుకున్నారు. అక్కడినుండి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుని మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దగల మండపానికి సారెను వేంచేపు చేశారు.