Big Alert: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఊహించని స్థాయిలో పోటెత్తుతున్నారు. సాధారణంగా బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీ భారీగా ఉంటుంది.. తరువాత నెమ్మదిగా ఆ రద్దీ తగ్గాలి.. కానీ ఎవరూ ఊహించని రీతిలో ఈ సారి రద్దీ ఉంటోంది. అది కూడా నాలుగు కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశ విదేశాల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు. అయితే ప్రస్తుతం స్వామివారి క్షేత్రం భారీ సంఖ్యలో భక్తుల రద్దీ నెలకొంది. ఓ వైపు వారాంతపు సెలవులు మరోవైపు పవిత్రమైన పెరటాసి మాసం కారణంగా
తమిళనాడు నుండి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. దీంతో గత రెండు రోజులుగా తిరుమలలో యాత్రికుల సంఖ్య అధికంగా ఉంది.
బ్రహ్మోత్సావాల సమయంలో కూడా ఈ స్థాయి రద్దీ లేదు.. ఎందుకంటే గోగర్భం డ్యాం దగ్గర వరకు క్యూ లైన్లు ఉన్నాయి అంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు. నగర ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గోగర్భం డ్యాం దగ్గర క్యూ లైన్ను పరిశీలించి దర్శనం కోసం లైన్లో వేచి ఉన్న భక్తులతో కాసేపు మాట్లాడారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకుల వాలంటీర్లతో కలసి భోజనం, నీరు పంపిణీ చేశారు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తెల్లవారుజామున కొనసాగే వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్నిమార్చాలని సంచలన నిర్ణయం తీసుకుంది. ఉదయం 10 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనం మార్పు చేస్తామని ప్రకటించారు ఈవో ధర్మారెడ్డి. అటు
గదుల కేటాయింపు కౌంటర్ కూడా తిరుపతిలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు టీటీడీ ఈవో.
నాలుగు రోజులుగా తిరుమలలో విపరీతమైన రద్దీ నెలకొనడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీవారి దర్శనానికి రెండు రోజుల సమయం పడుతోంది. తాజా నిర్ణయంపై పాలక మండలిలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే దీన్ని అమలు చేయనున్నారు. ముందు రోజు వచ్చిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉండిపోతారు. ఆ భక్తులను ఉదయాన్నే.. శ్రీవారి సేవలు అయ్యాక.. స్వామి వారి దర్శనానికి అనుమతించినట్లు అయితే వారు త్వరగా వెళ్లిపోవడానికి వీలు కలుగుతుందని అంచనా వేస్తున్నారు.
తిరుపతిలోనే గదులు కేటాయిస్తే.. ఎందుకంటే గదులు దొరకని భక్తులు తిరుమలలో ఇబ్బందులు పడుతున్నారు, అదే తిరుపతిలో గదుల కేటాయింపులు జరిగినట్లు అయితే.. గదులు దొరక్కపోతే.. తిరుపతిలోనే ప్రైవేట్ హోటల్స్ లో భక్తులు ఆశ్రయించే అవకాశం ఉంటుందని టీటీడీ భావిస్తోంది. అందుకే గదులు బుక్ అయిన వారికి మాత్రమే దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.