అనంతకోటి భక్త రక్షకుడు.. కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడు కనుకే తిరుమల పుణ్యక్షేత్రం నిత్యకల్యాణం పచ్చతోరణంలా విరాజిల్లుతోంది. అందుకే శ్రీవారి దర్శనార్థం నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఇలా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో రద్దీ ద్రుష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు పెద్ద పీఠ వేయాలన్ని టీటీడీ నిర్ణయం తీసుకుంది..
శ్రీవారి దర్శనార్థం పెద్ద సంఖ్యలో వచ్చే వీఐపీల కోసం కొద్దీ సంవత్సరాల క్రితం టీటీడీ ప్రత్యేక బ్రేక్ దర్శనాలను ఏర్పాటు చేసింది. మొదట ప్రతి రోజు ఉదయం, సాయంకాల సమయంలో బ్రేక్ దర్శనాలు ఏర్పాటు చేసి తిరుమలకు వచ్చే వీఐపీలు.. వివిఐపిలను వారు సిపార్సు చేయబడిన వారికి ప్రత్యేక బ్రేక్ దర్శనాలు కేటాయించి వారిని దర్శనానికి అనుమతించే వారు.
కాలక్రమేణా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఘనీయంగా పెరడంతో సామాన్య భక్తులకు అధిక సమయం శ్రీవారి దర్శన భాగ్యం కేటాయించాలన్న సంకల్పంతో అప్పటి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో శుక్ర, శని, ఆదివారాల్లో సాయంకాలం బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. దీంతో వారాంతంలో భక్తుల రద్దీ పెరిగిన బ్రేక్ దర్శనాల రద్దుతో రోజులు సగటున 15 వేల మందికి పైగా సామాన్య భక్తులకు అదనంగా దర్శనభాగ్యం కలిగింది.
సామాన్య భక్తుల దృష్ట్యా ఎనిమిదేళ్ల క్రితం బ్రేక్ దర్శన విధానంలో భారీ మార్పులను తీసుకొచ్చింది టీటీడీ. ముందుగా వారాంతం రోజులలో బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ క్రమేణా గురువారం మినహా మిగిలిన అన్ని రోజులలో సాయంత్రం బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. సాయత్రం బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేసి ఉదయం పూట మాత్రమే బ్రేక్ దర్శనాలు అమలు చేసింది టీటీడీ.
ఈ నిర్ణయంతో సామాన్య భక్తులకి అదనంగా మూడు గంటల పాటు స్వామి వారిని దర్శించుకునే అవకాశం ఏర్పడింది. గత ప్రభుత్వ హయంలో విఐపి బ్రేక్ దర్శనాలలో మూడు విధానాలను ప్రవేశ పెట్టారు. ఎల్ 1,ఎల్ 2 ,ఎల్ 3 విధానాన్ని తీసుకొచ్చారు. దీంతో టికెట్ ధర మాత్రం అందరికి 500 రూపాయలే అయినా స్వామి వారి ముందు ఒక్కొక్కరికి ఒక్కోలా దర్శనం చేయించేవారు. ఈ విధానంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.
తీవ్ర విమర్శల నేపథ్యంలో ఎల్ 1, ఎల్ 2 , ఎల్ 3 దర్శనాలపై కోర్టులో ప్రజా ప్రయోజనాలవాజ్యం వేసారు.. ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాల పేరుతో రోజు వేలాది విఐపి దర్శన టికెట్లు ను కేటాయించేవారు. శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై ఎలాంటి వైఖరి అవలంబిస్తున్నారో తెలియజేయాలని టీటీడీ ఈవోను హైకోర్టు ఆదేశించింది.
ఈ నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దుపై తగిన నిర్ణయం తీసుకుంటామని టీటీడీ బోర్డు చైర్మన్ చెప్పినట్టుగా మీడియాలో వచ్చిన కథనాలను ధర్మాసనం ప్రస్తావించింది. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది అనుమానాలను వ్యక్తం చేశారు. బ్రేక్ దర్శనాలపై టీటీడీ చైర్మన్ సొంతంగా నిర్ణయం తీసుకోలేరని, ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాలను ‘ప్రోటోకాల్ దర్శనం’గా మారుస్తారేమోనని సందేహం వ్యక్తం చేశారు. దీంతో ధర్మాసనం.. బ్రేక్ దర్శనాలపై తగిన వివరణ ఇవ్వాలని టిటిడి ని ఆదేశించింది.
విఐపి బ్రేక్ దర్శనాలలో సాములా మార్పులు... సామాన్య భక్తుల తరువాత విఐపిలకు దర్శన భాగ్యం కల్పిస్తూ టీటీడీ తాజాగా నిర్ణయం తీసుకుంది. సామాన్యులు సైతం ఎమ్మెల్యే.. ఎంపీ.. ఇతర ప్రోటోకాల్ ప్రముఖుల లేకలపై విఐపి బ్రేక్ దర్శనాలు పొందుతున్నారు. ఎలాంటి సిపార్సు లేకుండా... గంటల తరబడి క్యూలైన్లో వేచియుండే భక్తులకు మాత్రం కొంత మేర ఇబ్బందులు తప్పడం లేదు.
రాత్రంతా క్యూలైన్ లో వేచి ఉన్న భక్తులకు త్వరితగతిన దర్శన భాగ్యం కల్పించాలన్న ఉద్దేశంతో టీటీడీ మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఉదయం 5 నుంచి 8 గంటల వరకు సాగె విఐపి బ్రేక్ దర్శన టైమింగ్స్ లో మార్పులు తీసుకురానుంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12ల వరకు బ్రేక్ దర్శనాల సమయంలో మార్చు చేయనున్నారు.
స్వామి వారికీ నిత్య కైంకర్యాలు అయినా వెంటనే... ఉదయం 5 నుంచి 8 గంటల వరకు సామాన్యులకు దర్శనభాగ్యం కల్పించాలని., ఆ తరువాత ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు బ్రేక్ దర్శనం ప్రారంభించేలా నిర్ణయం తీసుకుంది. ఈ విధానం ద్వారా సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం., గదుల కేటాయింపు పై ఒత్తిడి తగ్గించేలా టీటీడీ ఈ నిర్ణయాన్ని ప్రయోగాత్మకంగా డిసెంబర్ నుంచి ప్రారంభించనుంది.