TTD Alert: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. చాలా కాలంగా ఎదురుచూస్తున్న రోజు వచ్చింది. ప్రీ టైం స్లాట్ సర్వదర్శన్ల టోకెన్ల జారీ ప్రక్రియ పున: ప్రారంభమైంది. దీంతో సామాన్య భక్తులు ముందస్తుగా ఎలాంటి బుకింగ్ చేసుకోకుండా నేరుగా తిరుమలకు రావొచ్చు.. ఇచ్చిన టైం ప్రకారం స్వామి వారిని ఉచితంగా దర్శించుకోవచ్చు.. మరోవైపు తిరుమలలో పుష్పయాగానికి అంకురార్పరణ ప్రారంభమైంది..
తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాల దగ్గర నేటి నుంచి ప్రయోగాత్మకంగా సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ ప్రక్రియ పునఃప్రారంభమైంది. ఈ నేపథ్యంలో టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జెఈవో శ్రీ వీరబ్రహ్మం, ఇతర అధికారులతో కలిసి సోమవారం సాయంత్రం ఏర్పాట్లను పరిశీలించారు.
టోకెన్ల జారీ కౌంటర్లు, క్యూలైన్లు, భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా భూదేవి కాంప్లెక్స్ వద్ద ఈవో మీడియాతో మాట్లాడుతూ టిటిడి ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు మంగళవారం నుంచి ప్రయోగాత్మకంగా తిరుపతిలో ఉచిత సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీని పునఃప్రారంభిస్తున్నామని చెప్పారు.
మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు జరుగనున్న పుష్పయాగానికి సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో మూలవిరాట్ ఎదురుగా ఆచార్య ఋత్విక్‌వరణం నిర్వహించారు. అర్చకులకు విధుల కేటాయింపునే ఋత్విక్‌వరణం అంటారు. ఇందులో వైదిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతను అప్పగిస్తారు. సాక్షాత్తు శ్రీవారి ఆజ్ఞ మేరకు విధులు పొందినట్టు అర్చకులు భావిస్తారు.
రాత్రి 6 గంటలకు శ్రీవారి సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనుల వారిని ఆలయం నుండి వసంత మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించి తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. రాత్రి 8 నుండి 9 గంటల నడుమ ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు.
నేటి నుంచి పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు.
మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ కారణంగా అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం ఆర్జితసేవలను టిటిడి రద్దు చేసింది.