తిరుపతి ఎయిర్పోర్ట్లో శ్రీవాణి దర్శనం టికెట్ల కౌంటర్ ప్రారంభించిన జేఈవో దీనిపై ప్రకటన చేశారు. శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుండి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కోసం శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ కోటాను డిసెంబర్ 22న ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని ఆయన కోరారు.
ఈ సారి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో.. రోజుకు దాదాపు 80 వేల మందికి దర్శనం కల్పించాలని నిర్ణయించారు. అలాగే ఆర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు. అన్నిరకాల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేసింది. శ్రీవాణి, ఎస్ఇడి టిక్కెట్లు, ఎస్ఎస్డి టోకెన్లు కలిగి ఉన్న భక్తులకు “మహా లఘు దర్శనం” చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు.
తిరుమల స్థానికుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన కౌంటరుతో పాటు తిరుపతిలోని తొమ్మిది కేంద్రాల్లో రోజుకు 50 వేలు చొప్పున మొత్తం ఐదు లక్షల ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేస్తారు. ఆధార్ కార్డ్ తప్పనిసరిగా చూపి ఈ టోకెన్లు పొందాల్సి ఉంటుంది. ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేసే తొమ్మిది ప్రదేశాలను రెండు క్లస్టర్లుగా విభజించి జెఇఓలు పర్యవేక్షిస్తారు.