Tirumala Temple Online Tickets: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి లక్షల సంఖ్యలో నిత్యం భక్తులు వస్తుంటారు.. కరోనా సమయంలోనూ భక్తులు భారీగానే పోటెత్తుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వెంకన్న స్వామికి ఆదరణ ఉంది. దీంతో ఆ క్రేజ్ ను కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. అడ్డదారుల్లో డబ్బు సంపాదనకు దేవుడుని కూడా వాడేసుకుంటున్నారు.
కరోనా వైరస్ మొదలైన దగ్గర నుంచి స్వామివారిని దర్శించుకోవాలంటే.. ఆన్ లైన్ (Online) లో టికెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. కేవలం ఆన్ లైన్ లో టికెట్లు తీసుకున్న వారికి మాత్రమే దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు. దీంతో స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తులు ఆన్ లైన్ లో టిటిడీ టికెట్స్ రిలీజ్ చేసే సమయం కోసం ఎదురుచూస్తున్నారు.
ఇక్కడ సమస్య ఏంటంటే.. టికెట్లు రిలీజ్ చేసిన క్షణాల్లోనే టికెట్లు అయిపోతుండడం ఆందోళన పెంచుతోంది. రిలీజ్ చేసిన వెంటనే టోకెన్లు అయిపోతున్నాయి. దీంతో ఎంతోమంది భక్తులు స్వామివారి దర్శనం కోసం నెలల తరబడి ఎదురచూడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. కొంతమంది కేవలం ఆన్ లైన్ లో టికెట్లు దొరకకే స్వామి వారిని దర్శించుకోలేకపోతున్నారు.
ఈ డిమాండ్ ను కొంతమంది క్యాష్ చేసుకుంటున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం పేరుతో భక్తులను మోసగిస్తూ ఇటీవల చాలా నకిలీ వెబ్ సైట్లు పుట్టుకొచ్చాయి. ఈ నకిలీ వెబ్ సైట్ల దందా చాలాకాలం నుంచే నడుస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా భక్తుల సొమ్మును కాజేస్తున్నారు. తాజాగా ఈ నకిలీ వెబ్ సైట్లకు టిటిడీ విజిలెన్స్ చెక్ పెట్టింది.
అయితే మళ్లీ కరోనా విరుచుకుపడుతున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సూచన చేసింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కానీ, లేదా కోవిడ్ నెగటివ్ రిపోర్ట్ కానీ తీసుకురావాలని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.