Tirumala Visit:కరోనా థర్డ్ వేవ్ ఎఫెక్ట్ తిరుమల పైనా పడింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో భారీగా కేసులు పెరుగుతున్నాయి. రెండు వేలకు అటు ఇటుగా నిత్యం నమోదైన కేసులు ఉంటున్నాయి. అయితే ఇందులో తిరుపతి నుంచి వచ్చినవే ఎక్కువ కేసులు ఉంటున్నాయి. అందులోనూ ఆధ్యాత్మిక ప్రాంతమైన తిరుమలను సందర్శించుకునేందుకు వచ్చిన భక్తుల ద్వారానా వైరస్ విస్తరిస్తోందని అంచనా.
ముఖ్యంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి సన్నిధికి వెళ్లేందుకు దేశ వ్యాప్తంగా భక్తులు ఆసక్తి చూపిస్తారు.. కరోనా లాంటి వ్యాధులను కూడా లెక్క చేయకుండా స్వామిని దర్శించుకోవాలి అనుకుంటారు. ఒక్కసారి స్వామిని దర్శించుకుంటే తమ కష్టాలు తీరుపోతాయి అన్నది భక్తుల నమ్మకం.. అందుకే ఇలాంటి పరిస్థితుల్లోనూ భారీగా తిరుమలకు చేరుకుంటున్నారు భక్తులు..
అయితే మళ్లీ కరోనా విరుచుకుపడుతున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సూచన చేసింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కానీ, లేదా కోవిడ్ నెగటివ్ రిపోర్ట్ కానీ తీసుకురావాలని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ – 19 మూడవ వేవ్ “ఒమిక్రాన్” దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రతాపం చూపిస్తుందని హెచ్చరికలు జారీచేసాయి. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులు ఖచ్చితంగా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేదా దర్శనానికి 48 గంటల ముందు చేయించిన ఆర్టిపిసిఆర్ పరీక్ష నెగిటివ్ రిపోర్ట్ ను వెంట తీసుకురావాలని టీటీడీ అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.
ఇప్పటికే పలువురు భక్తులునెగిటివ్ సర్టిఫికేట్ లేకుండా స్వామివారి దర్శనం కోసం వస్తుండడంతో అలిపిరి చెక్ పాయింట్ వద్ద సిబ్బంది తనిఖీ చేసి వెనక్కు పంపుతున్నారు. దీనివలన మిగతా భక్తులు ఇబ్బందికి గురవుతున్నారు. వాక్సినేషన్ లేదా నెగటివ్ సర్టిఫికెట్లను అలిపిరి చెక్ పాయింట్ వద్ద చూపించిన వారిని మాత్రమే తిరుమల కొండపైకి అనుమతిస్తారని టీటీడీ అధికారులు స్పష్టం చేసారు.