ఈ నెల 28వ తేదీన ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఆన్ లైన్ టోకెన్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ మేరకు టీటీడీ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు రోజుకు 12 వేల చొప్పున టికెట్లు జారీ చేయనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక ఈ నెల 29వ తేదీ నుంచి రోజుకు 10 వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికార వెబ్ సైట్ లో మాత్రమే పెడతారు.. అక్కడ నుంచి లాగిన్ అయ్యాక.. ఆన్ లైన్ బుకింగ్ అప్సన్ క్లిక్ చేసి.. అక్కడ నుంచి మనకు కావాల్సిన డేట్లు వివరాలు ఎంట్రీ చేస్తూ టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర వెబ్ సైట్లలో ఎక్కడా టికెట్లు పెట్టిన నమ్మవద్దని టీటీడీ హెచ్చరిస్తోంది.
తాజాగా నకిలీ వెబ్ సైట్లను అధికారులు గుర్తించారు. ఎందుకంటే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి లక్షల సంఖ్యలో నిత్యం భక్తులు వస్తుంటారు.. కరోనా సమయంలోనూ భక్తులు భారీగానే పోటెత్తుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వెంకన్న స్వామికి ఆదరణ ఉంది. దీంతో ఆ క్రేజ్ ను కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. అడ్డదారుల్లో డబ్బు సంపాదనకు దేవుడుని కూడా వాడేసుకుంటున్నారు.
అందుకే అధికారులు పదే పదే చెబుతున్నారు. కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్ సైట్ లో మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాలని.. మరోవైపు మళ్లీ కరోనా విరుచుకుపడుతున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సూచన చేసింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కానీ, లేదా కోవిడ్ నెగటివ్ రిపోర్ట్ కానీ తీసుకురావాలని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.