AP Corona Virus: కరోనా థర్డ్ వేవ్ (Corona Third Wave) ఊహించని వేగంతో భారత దేశంపై దాడి చేస్తోంది. దాదాపు ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు అమలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కోవిడ్ పాజిటివ్ కేసులు భారీగా నమొదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) లో పరిస్థితుల నేపథ్యంలో.. రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం (AP Government) నిర్ణయించింది. దీంతో పాటు రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల దర్శనాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
భక్తులతో పాటు ఆలయ సిబ్బంది రక్షణకు ప్రత్యేక చర్యలు చేపదుతున్నామని దేవదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ స్పష్టం చేశారు. పుణ్యక్షేత్రాల్లో కరోనా విస్తరించకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. దీనికి భక్తులు కూడా సహకరించాలని కోరారు. అంతా కోవిడ్ నిబంధనలను తప్పక పాటించాలని కోరారు.
మరోవైపు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి నేటి నుంచి నిర్వహించే పౌర్ణమి గరుడసేవను టిటిడి రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవను ఏకాంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. కానీ శ్రీవారి ఆలయంలో ఆధ్యయనోత్సవాలు ఈ నెల26వ తేదీ వరకు జరుగుతున్నందున స్వామివారి గరుడసేవను టీటీడీ రద్దు చేసింది.
మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్నా.. తిరుమల్లో భక్తుల తాకిడి పెరుగుతూనే ఉంది. తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. నిన్న శ్రీవారిని 35,642మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం 11,178మంది భక్తులు శ్రీవారికి తమ తలనీలాలు అర్పించుకున్నారు.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాలు, పుణ్యక్షేత్రాల్లో క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ వద్ద థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్ ఏర్పాటు చేయాలని, మాస్క్ ధరించి, 6 అడుగుల భౌతిక దూరం పాటించేలా చూడాలని సూచించారు. అన్ని సేవా టిక్కెట్లను 50 శాతానికి తగ్గించాలని, వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ పూజా సేవలకు విస్తృతం చేయాలని అధికారులు నిర్ణయించారు.