కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి పార్వేట ఉత్సవము మకరసంక్రమునకు మరుసటిరోజు కనుమ పండుగనాడైన జనవరి 16వ తేదీ బుధవారం తిరుమలలో అత్యంత ఘనంగా జరిగింది. అదేరోజున గోదాపరిణయోత్సవం కూడా కన్నుల పండుగగా జరిగింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని ఆండాళ్ శ్రీ గోదాదేవి చెంత నుండి శ్రీవారికి ప్రత్యేక మాలలు కానుకగా అందాయి. ఈ మాలలను శ్రీవారి మూల మూర్తికి అందంగా అలంకరించారు.
బుధవారం స్వామివారికి ప్రాతఃకాలారాధన పూర్తి అయిన తరువాత శ్రీమలయప్పస్వామివారు తిరుచ్చిలో వేంచేసారు. వారి వెంటనే మరో తిరుచ్చిపై శ్రీ కృష్ణస్వామి వేంచేసారు. అనంతరం పార్వేట మండపమునకు వెళ్ళి, ఆ మండపమునందు పుణ్యాహము జరిగిన పిమ్మట మంచెలో వేంచేసారు. శ్రీస్వామివారికి ఆరాధనము, నివేదనము జరిగి హారతులు జరిగాయి. అనంతరం ఉభయదార్లకు తాళ్ళపాక వారికి, మఠంవారికి మర్యాదలు, స్వామివారు మండపమును వదలి ప్రాంగణమునకు వచ్చారు.