Tiruchanoor:భారత దేశంలో ఎక్కడ లేని విధంగా మహాలక్ష్మి అమ్మవారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం.. తిరుచనూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారికి ప్రతి ఏటా కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
అంకురార్పణ ఘట్టంలో ముందుగా భగవంతుని అనుజ్ఞ తీసుకుని షోడషోపచారాలు సమర్పించారు. సమస్తమైన విఘ్నాలు తొలగేందుకు విష్వక్సేనారాధన నిర్వహించారు. ఆ తరువాత స్థల శుద్ధి, ద్రవ్యశుద్ధి, శరీర శుద్ధి, ఆత్మశుద్ధి కోసం పుణ్యహవచనం చేపట్టారు. ఏ ఆటంకాలు రాకుండా ఉత్సావాల నిర్వహణ పూర్తి అవ్వాలని అమ్మవారికి విన్నవించుకున్నారు.
తరువాత నివేదన, బలిహరణ, నీరాజనం, మంత్రపుష్పం, తీర్థప్రసాద గోష్టి నిర్వహించారు. ఈ అంకురార్పణ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు,పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు , ఆలయ డెప్యూటి ఈఓ శ్రీ లోకనాథం, విజివో శ్రీ మనోహర్, ఎఇఓ శ్రీ ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, సూపరింటెండెంట్ శ్రీ శేషగిరి, ఎవిఎస్వో శ్రీ శైలేంద్రబాబు పాల్గొన్నారు.