Chandrababu: తన సొంత నియోజకవర్గంలో చంద్రబాబుకు ఉన్న ఫాలోయింగ్ మరోసారి తెలిసేలా చేశారు తెలుగు తమ్ముళ్లు.. లాఠీ ఛార్జీలు.. ముందస్తు అరెస్టులు.. వైసీపీ నేతల బెదిరింపులు.. అడుగడుగునా ఆంక్షల వలం అన్నింటినీ చేధించుకుంటూ వేల సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు చంద్రబాబుకు అండగా నిలిచారు. దీంతో కుప్పంలో పరిస్థితి కుస్తీ పోటీలను తలపించింది.
పోలీసు నిర్బంధాలు, అడ్డంకులను ఛేదించుకొని తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులోని శాంతిపురం మండలం జేపీ కొత్తూరు వద్ద అధినేతకు ఘనంగా స్వాగతించారు. వారిని చూసి వాహనం నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు.. అభివాదం చేస్తూ ముందుకు సాగారు. టీడీపీ శ్రేణులు భారీగా తరలిరావడంతో పెద్దూరు రహదారి జనసంద్రంగా మారింది.
చంద్రబాబు పర్యటనకు ఎలాంటి అనుమతులు లేవని కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ లెక్కచేయకుండా తెదేపా శ్రేణులు భారీగా తరలివచ్చారు. క్రేన్ సాయంతో చంద్రబాబుకు గజమాల వేసి అభిమానం చాటుకున్నారు. అప్పటికే చంద్రబాబు ప్రచార రథాన్ని సీజ్ చేసిన పోలీసులు.. పెద్దూరులో తెదేపా నేతలు ఏర్పాటు చేసిన మైకులు తొలగించారు.
కాగా పోలీసుల వైఖరికి నిరసనగా టీడీపీ కార్యకర్తల (TDP Protest) ఆందోళనకు దిగారు. ‘కుప్పం గడ్డ.. చంద్రబాబు అడ్డా’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. చంద్రబాబును అడ్డుకున్న పెద్దూరుకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నాయి. కాగా ముందుస్తుగానే ఈ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రికత్త నెలకొంది.