తెలుగు రాష్ట్రాలు అగ్ని పర్వతాల్లా ఉడికిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు ఎప్పుడూ లేని విధంగా 46 డిగ్రీలు దాటేస్తుండటం ఆందోళన కలిగించే విషయం.
పని మీద బయటకు వచ్చే ప్రజలు... తగిన మోతాదులో సాల్ట్, షుగర్ వాటర్ తీసుకోకపోతే, దాహం ఎక్కువై, వడ దెబ్బ తగిలి... చనిపోతున్నారు కూడా. అందుకే ప్రభుత్వాలు ఓఆర్ఎస్ ప్యాకెట్లను సప్లై చేస్తున్నాయి.
ఎండల వల్ల ఇప్పటికే ఏపీలో 18 మంది చనిపోగా... తెలంగాణలో 13 మంది చనిపోయినట్లు తెలిసింది. రోజురోజుకూ మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకర అంశం.
ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ప్రజలు ఇండ్లు, ఆఫీసుల్లోంచీ బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. చిన్నారులు, ముసలివాళ్ల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఎండలకు తోడు వేడి గాలులు వీస్తున్నాయి. వాటిని తేలిగ్గా తీసుకుంటే ప్రమాదమే. చాలా మందికి వడ దెబ్బ తగలడానికి వేడి గాలులు కూడా కారణమేనని తేలింది.
వీలైనంతవరకూ నీడలో ఉండాలి. తరచూ మంచినీళ్లు తాగుతూ ఉండాలి. బాడీలో సాల్ట్, షుగర్ లెవెల్స్ తగ్గిపోకుండా నిమ్మకాయ వాటర్, ఓఆర్ఎస్ లాంటివి తీసుకోవడం తప్పనిసరి.
నీరు ఎక్కువగా ఉండే ఆహారాలు, పండ్లు, జ్యూస్ల వంటివి తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.
రోహిణీ కార్తె రాకముందే ఇంత వేడి ఉండటానికి ప్రధాన కారణం మొన్న వచ్చిన ఫొణి తుఫానే. తుఫాను వచ్చినప్పుడు వాతావరణం మొత్తం అల్లకల్లోలంగా మారి... పశ్చిమం వైపు నుంచీ వచ్చిన గాలుల్లో వేడి పెరిగింది. దానికి తోడు నీటి ఆవిరికి ఎండ తోడై... ఉక్కపోత చంపుతోంది.