Chandrababu Naidu Srikakulam Tour: గత ఎన్నికల్లో టీడీపీ కేవలం రెండు సీట్లకే పరిమితమైంది శ్రీకాకుళం జిల్లా. అప్పటి నుంచి పార్టీ పరిస్థితి గందరగోళంగా మారింది. తరువాత జరిగిన అన్ని ఎన్నికల్లో వైసీపీ హవా కనిపించింది. దీంతో కేడర్ లో ఆశలు సన్నగిల్లాయి. ఇక పార్టీకి పూర్వ వైభవం కష్టమే అని కేడర్ మదనపుడుతున్న వేళ.. పార్టీ అధినేత చంద్రబాబు పర్యటన ఫుల్ జోష్ నిపించింది. గ్రామస్థులతో కలసి చంద్రబాబు సహపంక్తి భోజనం చేయడంతో.. వారిలో కొత్త ఉత్సాహం కనిపించింది.
బాదుడే బాదుడు కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా నుంచే ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జిల్లా ముఖద్వారం దగ్గర చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. ఆ తరువాత జరిగిన రోడ్ షో కు భారీగా స్పందన కనిపించింది. ఈ సందర్భంగా పెరిగిన పన్నుల భారం, విద్యుత్ కోతలు, బస్సు, విద్యుత్ ఛార్జీలపై మండిపడ్డారు చంద్రబాబు..
శ్రీకాకుళం జిల్లా పర్యటన కోసం మొదట విశాఖ ఎయిర్ పోర్ట్ చేరుకున్న చంద్రబాబు అక్కడి నుండి రోడ్డు మార్గంలో చేరుకున్నారు. తమ అధినేత చంద్రబాబుకు.. టీడీపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత అక్కడే ఉన్న టీడీపీ దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడి విగ్రహానికి పూల మాల వేసిన చంద్రబాబు...ఆయనకు నివాళి అర్పించారు.
శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం దళ్లవలసలో బుధవారం రాత్రి జరిగిన నిరసన సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ పాలన వల్ల రాష్ట్రం మరో శ్రీలంక అవడం ఖాయమంటూ విమర్శలు గుప్పించారు. ఒక్క చాన్స్ అనగానే అందరూ మాయలో పడ్డారని టీడీపీ అధినేత, చంద్రబాబు అన్నారు.
విద్యుత్ ఉండదు కానీ.. బిల్లు మాత్రం బాదుడే బాదుడంటూ విమర్శించారు. నేను ఫైబర్‌నెట్ రూ.140కి ఇస్తే... రూ.290కి పెంచారన్నరు. రాష్ట్రంలో విచిత్రమైన బ్రాండ్ల వల్ల నాటు సారా పెరిగిందని, తాను జగన్‌లా దోచుకోలేదు, దాచుకోలేదన్నారు. ఈ మూడేళ్లలో ఉత్తరాంధ్రలో ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలేదని విమర్శించారు. తమ ప్రభుత్వంలో ప్రైవేటు రంగంలో 5.50 లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు.
రైతుల మోటార్లకు జగన్ మీటర్లు పెడతానంటున్నారని, అలా రైతుల మోటార్లకు మీటర్లు పెడితే ఉచిత విద్యుత్ పోతుందన్నారు. తాజాగా జరుగుతున్న పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాలను సైతం అమ్ముకుంటున్నారని విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో ఆస్తులు, ఆడబిడ్డలు, ప్రాణాలకు రక్షణ లేదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డ్రగ్స్‌కు చిరునామాగా మారిపోయిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు.