Andhra Pradesh: మహిళల రక్షణపై మరింత మందికి అవగాహన కల్పించడంపై ఉన్నతాధికారులు ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా మహిళల భద్రతకై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది దిశ యాప్.. అయితే దిశ యాప్ ను మహిళలకు మరింత చేరువ చేసేందుకు ప్రకాశం జిల్లా ఎస్పి మలిక గార్గ్ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు.
ఆంధ్రప్రదేశ్ లో మరెక్కడా లేని విధంగా దిశ యాప్ లక్కీ డ్రా కాంటెస్ట్ ప్రారంభించి విజేతలుగా నిలిచిన 21 మంది మహిళలు, విద్యార్థులకు బహుమతులను జిల్లా పోలీస్ కార్యాలయంలో అందజేశారు. గత వారంలో అత్యధికంగా 459 మంది మహిళలతో దిశ యాప్ ను డౌన్ లోడ్ చేయించి.. దాని వినియోగం గురించి వివరించిన మార్కాపురానికి చెందిన మహిళా పోలీస్ జయ కమల ను ప్రత్యేకంగా అభినందించి, బహుమతి మరియు ప్రశంసాపత్రం అందజేశారు.
దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్న మహిళల జాబితాలో లక్కీ డ్రా నిర్వహించి విజేతలుగా నిలిచిన మహిళలు, వారి కుటుంబ సభ్యులతో ఎస్పీ మలిక గార్గ్ సమావేశం నిర్వహించారు. ఆపద, సమస్య ఉన్న సమయంలో రక్షణ పొందేందుకు దిశ యాప్‌లో ఉన్న SOS బటన్ నొక్కితే ఫోన్ నెంబర్, చిరునామా, లొకేషన్‌తో సహా వాయిస్ పది సెకన్లు రికార్డు అవుతుందని, ఈ సమాచారం దిశ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు తక్షణం చేరుతుందని ఎస్పీ తెలిపారు.
జిల్లాలో దిశ పోలీసు స్టేషన్ పనితీరు మరింత మెరుగుపరుస్తున్నామని, మహిళలపై వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు వస్తే తక్షణం స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నిర్ణీత గడువులోగా దోషులకు శిక్ష పడేలా చేస్తున్నామని తెలిపారు. ఫిర్యాదులు తమ పరిధి కానప్పటికీ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నామని అన్నారు.